'స్క్రీన్ రైట‌ర్' అనే ప‌దానికి నిర్వ‌చ‌నం ఈ లెజెండ్

నాయర్ సాంప్రదాయ జానపద కథలు, అతడి స్వస్థలం లోని అంద‌మైన‌ ల్యాండ్‌స్కేప్‌లను వ‌ర్ణించ‌డంలో అతడి విలక్షణమైన కథన శైలికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

Update: 2024-12-26 07:43 GMT

భార‌తీయ సినిమా సుసంప‌న్న‌మైన స్క్రీన్ రైటింగ్ క‌ళ‌తో గొప్ప సినిమాల‌ను అందించ‌గ‌లిగింది. నాటి త‌రంలో మ‌ల‌యాళ చిత్ర‌సీమ నుంచి మేటి స్క్రీన్ రైట‌ర్ గా పాపుల‌రైన ఎం.టి.వాసుదేవ‌న్ నాయ‌ర్ దేశంలోనే గొప్ప ర‌చ‌యిత‌ల‌లో ఒక‌రిగా పాపుల‌ర‌య్యారు. కథా రచయిత, దర్శకుడు , నవలా రచయిత అయిన వాసుదేవన్ నాయర్ శ్వాస‌సంబంధ స‌మ‌స్య‌ల‌తో డిసెంబర్ 25న కోజికోడ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 91.

మలయాళం-భాషా సినిమా, సాహిత్యానికి ఆయన చేసిన కృషి కేరళలో కథలను రీడిఫైన్ చేసింది. నాయర్ సాంప్రదాయ జానపద కథలు, అతడి స్వస్థలం లోని అంద‌మైన‌ ల్యాండ్‌స్కేప్‌లను వ‌ర్ణించ‌డంలో అతడి విలక్షణమైన కథన శైలికి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఆయ‌న 1960వ దశకం సినీర‌చ‌యిత‌గా కెరీర్ ప్రారంభించారు. ప‌రిశ్ర‌మ‌లో గొప్ప‌ స్క్రీన్‌ప్లేలు అందించిన‌ మాస్టర్‌గా ఎదిగారు నాయ‌ర్‌. మలయాళ చలనచిత్ర సీమ‌లో అత‌డు ఒక వేవ్ అన‌డంలో సందేహం లేదు. మురప్పెన్ను (1965) చిత్రంతో నాయర్ స్క్రీన్ రైటర్‌గా అరంగేట్రం చేసారు. ఎ. విన్సెంట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాత్ర-ఆధారిత క‌థార‌చ‌యిత‌గా, భావోద్వేగాల‌ను స్ప‌ర్శించే ర‌చ‌యిత‌గాను నాయ‌ర్ పాపుల‌ర‌య్యారు. నిర్మాల్యం (1973) వంటి స‌జీవ‌మైన‌ రచనలు సహా 60 చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాసిన ఉద్ధండుడు ఆయ‌న‌. నిర్మాల్యం చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాతోనే ఆయ‌న ద‌ర్శ‌కుడిగాను ఆరంగేట్రం చేసారు. ఒరు వడక్కన్ వీరగాథ (1989) చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే ర‌చ‌యిత‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. అత‌డు రాసిన ఒకానొక చిట్టి క‌థ నుంచి రూపొందించిన క్లాసిక్ చిత్ర‌మిది. ఆధునిక భావ‌జాలంతో జానపద కథలను పునర్నిర్వచించే అతడి సామర్థ్యాన్ని ఈ సినిమా ప్రదర్శించింది.

అదూర్ గోపాలకృష్ణన్, హరిహరన్, పద్మరాజన్ వంటి దిగ్గ‌జ‌ దర్శకులతో అతడు ర‌చ‌యిత‌గా ప‌ని చేసారు. వారి క‌ల‌యిక మలయాళ సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. పంచాగ్ని (1986), పెరుమ్తచన్ (1990) వంటి చిత్రాలు మానవ సంబంధాలను, నాటి కేరళ సామాజిక రాజకీయ కోణాల‌ను ఆవిష్క‌రించాయి. నైతిక సంఘర్షణ, అస్తిత్వ సందిగ్ధత , గ్రామీణ జీవితంలోని చాలా సంక్లిష్టమైన అంశాల‌ను ఆయ‌న త‌న క‌థ‌ల్లో ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు.

మ‌ల‌యాళ సినిమాకి ఆయన చేసిన కృషి ఫ‌లించి మొత్తం ఆరు జాతీయ అవార్డులు, పలు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. నాయర్ సాహిత్యంలోను అసాధార‌ణంగా రాణించారు. నాయ‌ర్ మొదటి ప్రధాన నవల 'నాలుకెట్టు' (1958) సమాజంలోని మాతృస్వామ్య వ్యవస్థలోని కుటుంబాలు, తరాల వైరుధ్యాలను ఆవిష్క‌రించిన‌ సంచలనాత్మక న‌వ‌ల‌. ఈ నవల అతడిని మలయాళ సాహిత్యంలో ప్రముఖుడిగా నిలబెట్టింది. కేరళ సాహిత్య అకాడమీ అవార్డును సంపాదించిన న‌వ‌ల ఇది. సంవత్సరాలుగా, నాయర్ అనేక నవలలు, చిన్న కథలు, వ్యాసాలను రచించారు. వీటిలో చాలా వరకు ప‌లు భాషల్లోకి అనువాదం అయ్యాయి. సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1995లో భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జీ5 గ్లోబల్ 'మనోరతంగల్' అనే తొమ్మిది భాగాల మలయాళ వెబ్ సిరీస్ ని ప్రారంభించింది. ఇది నాయర్ వారసత్వాన్ని తెలియజేసే ప్ర‌య‌త్నం.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లెజెండ‌రీ ర‌చ‌యిత నాయ‌ర్‌కు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసారు. మలయాళ సినిమా, సాహిత్యంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన శ్రీ ఎమ్‌టి వాసుదేవన్ నాయర్ జీ మరణించడం బాధాకరం. అతని రచనలు, మానవ భావోద్వేగాల లోతైన అన్వేషణ తరాలను తీర్చిదిద్దాయి. మరెన్నో స్ఫూర్తిని కొనసాగిస్తాయి అని మోదీజీ అన్నారు.

Tags:    

Similar News