అలనాటి నటికి మరో అరుదైన గౌరవం

Update: 2017-09-11 04:12 GMT
పాత తరం నటులు.. సినిమాలను ఇష్టపడే వారిలో సావిత్రిని ఇష్టపడని వారుండరు. దాదాపు అదే స్థాయిలో అభిమానులున్న మరో నటి జమున. అహంకారంతో సత్యభామలా రుసరుసలాడినా.. అనురాగంతో ఆదరించే దేవతలా కనిపించినా ఆమెకే చెల్లు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆమెది సుదీర్ఘమైన పయనం. పదహారేళ్లకే నటనా రంగంలో అడుగుపెట్టి తెలుగు - తమిళం - కన్నడ - హిందీ భాషలన్నింటిలో కలిపి 200కి పైగా సినిమాల్లో నటించిన ఘనత ఆమెది. ప్రస్తుతం జమున వయస్సు 74.

 విశాఖపట్నానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుబ్బిరామిరెడ్డికి మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే కాస్త అభిమానం ఎక్కువే. ఏటా తన పుట్టినరోజు నాడు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన వారిలో ఒకరిని ఎంపిక చేసి.. బ్రహ్మాండమైన సన్మానం చేసి బిరుదు ఇస్తుంటారు. సెప్టెంబరు 16న జమునను విశాఖలో ఘనంగా సన్మానించడంతో పాటు ఆమెకు నవరస నట కళావాణి అనే బిరుదు ప్రదానం చేయనున్నారు. జమున తన జీవితంలో వజ్రోత్సవ సంవత్సరంలో (డైమండ్ జూబ్లీ) అడుగు పెడుతున్న సందర్భంగా ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేశామని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

జమున సన్మాన కార్యక్రమానికి ఆమెతోపాటు కలిసి నటించిన బి.సరోజాదేవి - వాణిశ్రీ - శారద - జయప్రదద- జయసుధ - కృష్ణంరాజు - మోహన్ రాజు - అలనాటి అందాల తార శ్రీదేవి ఈ వేడుకులకు హాజరు కానున్నారు. సాధారణంగా సుబ్బిరామిరెడ్డి నిర్వహించే ప్రోగ్రాంలన్నింటికీ ఆహ్వానించిన సెలబ్రిటీల్లో చాలామంది హాజరవుతుంటారు. ఈ లెక్కన సెప్టెంబరు 16న విశాఖలో నాటి తారాలోకమంతా సందడి చేయనుంది.
Tags:    

Similar News