అలా చేస్తే నాజ‌ర్ ని మెగాస్టార్ చంపేస్తాన‌న్నార‌ట‌

Update: 2022-06-02 23:30 GMT
జీవితంలో క‌లిసి ప్ర‌యాణించిన వాళ్లు భ‌విష్య‌త్తులో ఏమౌతారో ఎలాంటి హోదాలో వుంటారో ఎవ‌రూ చెప్ప‌లేరు.. ఒక‌రు యాక్ట‌ర్ కావ‌చ్చు.. మ‌రొక‌రు క్రికెటర్ కావ‌చ్చు.. ఒక‌రు టెండుల్క‌ర్ లా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ గా పాపుల‌ర్ కావొచ్చు.. మ‌రొక‌రు కాంబ్లీలా క్రికెట్ నుంచి నిష్క్రమించొచ్చు.. ఇలాంటి అనుభ‌వ‌మే త‌న‌కూ ఎదురైంద‌ని అంటున్నారు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాజ‌ర్‌. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నాజ‌ర్ ప్ర‌స్తుతం అత్య‌ధికంగా తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ అల‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

అంతే కాకుండా ఓకానొక సంద‌ర్భంలో త‌న‌ని మెగాస్టార్ చిరంజీవి చంపేస్తాన‌న్నార‌ని షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే.. యాక్టింగ్ స్కూల్ లో నేను, చిరంజీవి ఒకే బ్యాచ్‌. ఇద్ద‌రం క‌లిసే యాక్టింగ్ కోర్స్ చేశాం. చిరు నాతో చాలా ఫ్రెండ్లీగా వుండేవాడు. మా బ్యాచ్ లో పెద్ద స్టార్ గా ఎదిగిన వాళ్ల‌లో త‌నే మొద‌టి వాడు. ఫిల్మ్ స్కూల్ లో యాక్టింగ్ కోర్స్ పూర్త‌య్యాక చిరు న‌టుడ‌య్యాడు. నేను మాత్రం తాజ్ కోర‌మండ‌ల్ హోట‌ల్ లో వెయిట‌ర్ గా మారాను. ఓ సారి ఆ హోట‌ల్ ప‌క్క‌నున్న ఫిల్మ్ చాంబ‌ర్ లో చిరంజీవిగారు షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ విష‌యం నాకు తెలియ‌దు.

నేను మ‌ధ్యాహ్నం హోట‌ల్ నుంచి ఇంటికి వెళుతుంటే జ‌నాలు అంతా భారీ స్థాయిలో గుమిగూడి వుండ‌టం గ‌మ‌నించి వెళ్లి చూశాను. చిరంజీవి క‌నిపించాడు. అయితే త‌ను న‌న్ను చూడ‌క ముందే అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని సైకిల్ ని వెన‌క్కి తిప్పాను. అప్ప‌టికే చిరంజీవి న‌న్ను చూసేశారు. వెంట‌నే పిలిచి ఏంటీ నాజ‌ర్ ఏం చేస్తున్నావ్‌? అని అడిగారు. హోట‌ల్ లో ప‌నిచేస్తున్నాన‌ని చెప్పా. వెంట‌నే అదేంటీ?   మంచి న‌టుడివి హోట‌ల్ లో ప‌నిచేయ‌డం ఏంటీ?  రేపు వ‌చ్చి న‌న్ను క‌లువు అన్నారు.

నేను ఓకే అన్నాను. కానీ వెళ్ల‌లేదు. అయితే నాకు ఆ స‌మ‌యంలో సినిమాల‌పై పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. నెల జీతం వుంటే కుటుంబాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకునే అవ‌కాశం వుంటుంద‌ని భావించేవాడిని. హోట‌ల్ జాబ్ తోనే సెటిల్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

అయితే సినిమా న‌న్ను విడిచి ఎట్ట‌లేదు. చివ‌రికి ఒక‌రోజు కె. బాల‌చంద‌ర్ గారిని క‌లిశాను. ఆయన న‌టుడిగా అవ‌కాశం ఇచ్చారు. ఆ త‌రువాత న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ చిరంజీవితో క‌లిసి న‌టించే అవ‌కాశం నాకు ద‌క్క‌లేదు. 'ఖైదీ నెంబ‌ర్ 150'లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ ప్ర‌యాణంలో చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. నేను న‌టుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్నాను.  

చిరు నాకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఏ రోజూ అనుకోలేదు. ఇప్ప‌టికీ మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం అలాగే కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా మీకు ఓ విష‌యం చెప్పాలి. నేను ఫిల్మ్ స్కూల్ లో చ‌దువుకుంటున్న రోజుల్లో చెన్నైకి 60 కిలోమీట‌ర్ల దూరంలో వున్న చెంగ‌ల్ ప‌ట్టు నుంచి వ‌చ్చేవాడిని. టైమ్ కు రావాలంటే ఉద‌యం 6 గంట‌ల‌కే చెంగ‌ల్ ప‌ట్టు నుంచి బ‌య‌లుదేరే వాడిని. టైమ్ లేక‌పోవ‌డంతో కేవ‌లం అన్నం మాత్ర‌మే తీసుకెళ్లే వాడిని. చిరంజీవితో పాటు మ‌ద్రాస్ లో వున్న తెలుగు ఫ్రెండ్స్ అంతా ఆంధ్రా మెస్ నుంచి భోజ‌నం తెప్పించుకునేవారు. ఒక రోజు నా గురించి తెలిసి 'మీ అమ్మ‌గారిని పొద్దున్నే వంట చేయ‌మ‌ని ఇక‌పై ఇబ్బంది పెడితే చంపేస్తా' అన్నారు అని ఆనాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు నాజ‌ర్‌.
Tags:    

Similar News