టాలీవుడ్ లో నెపోటిజంపై కామెంట్స్ చేయడానికి ఆలోచిస్తున్నారా...?

Update: 2020-06-26 07:15 GMT
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా 'నెపోటిజం'పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. ఇప్పుడు మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా దీనిపై డిస్కషన్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారు అని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారు అంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇటీవల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా 'నెపోటిజం'పై కామెంట్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లో కూడా 'నెపోటిజం'పై చర్చిస్తున్నారు. తెలుగులో బాగా నెపోటిజం ఉందనేది ఎప్పటి నుంచో వస్తున్న మాట. ఇక్కడ దాదాపు స్టార్స్ అంద‌రూ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పైకి వ‌చ్చిన వారే. ఎక్క‌డో ఒకరిద్ద‌రు త‌ప్పితే మిగ‌తా వారంత బ్యాగ్రౌండ్ తోనే సినిమాలు చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ద‌గ్గ‌బాటి ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలే ఉన్నాయి. టాలెంట్ ఉన్నా లేకున్నా అలాంటి వారికే ఆఫర్స్ వస్తుంటాయి.. వారి సినిమాలే ఏడాది పొడవునా రిలీజ్ అవుతుంటాయి అనే ఆలోచనలో అందరిలోనూ ఉంది. కాకపోతే దీనిపై ఎవరూ బయటకు మాట్లాడటం లేదు. అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో చాలా బంధుప్రీతి ఉందని ఇప్పుడప్పుడే ఎదుగుతున్న చాలా మంది హీరోలు అభిప్రాయ పడుతున్నారట. అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వారు మాత్రం వ్యాపారం కావచ్చు.. రాజకీయం కావచ్చు.. సినిమా కావచ్చు.. రంగం ఏదైనా తమ కుటుంబంలోని సభ్యుడ్ని ప్రోత్సహించుకోవడం కొత్త విషయం కాదు.. నెపోటిజం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వారి వారి పిల్లల్ని వారి బంధువుల్ని ప్రోత్సహించుకోవడం కామన్ గా అన్ని రంగాల మాదిరే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది.. అయితే దీని కారణంగా టాలెంట్ ని తొక్కేస్తున్నారనే ఆరోపణల్ని నేను వ్యతిరేకిస్తున్నాను.. కాబట్టి ఆ ఆరోపణలు పనిలేని వాళ్లు పబ్లిసిటీ కోసం చేసే ప్రచారం అని పేర్కొన్నాడు.

అయితే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు అవకాశాలు పక్కన పెడితే సినిమా విడుదల విషయంలో కూడా నెపోటిజం తమకి అడ్డుతగులుతుందని ఆరోపిస్తున్నారట. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోల సినిమాలకు మాత్రమే మంచి రిలీజ్ డేట్స్ దొరికడంతో పాటు థియేటర్స్ కూడా అందుబాటులో ఉంటాయని.. ఇప్పుడిప్పుడే తమ టాలెంట్ తో పైకొస్తున్న హీరోల సినిమాలకు థియేటర్స్ దొరకనివ్వకుండా చేస్తారని ఆరోపిస్తున్నారట. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ హీరోలు కూడా థియేటర్స్ దొరకనివ్వడం లేదనే బాధని వెలిబుచ్చుతున్నారట. ఐతే ఈ విషయాన్ని బయటకు మాత్రం ఎవరూ చెప్పడానికి సాహసం చేయడం లేదట. ఇండస్ట్రీలోని పలువురు మాత్రం మంచు హీరోలు కూడా నెపోటిజం వల్ల వచ్చిన వారే కదా అని కామెంట్స్ చేస్తున్నారట.
Tags:    

Similar News