ప్రభాస్ ఏ దేశంలో ఏ మూలకెళ్లినా అంతే!

Update: 2022-01-07 23:30 GMT
టాలీవుడ్ హీరోలతో ఇంతకుముందు ఇక్కడ అవుట్ డోర్ షూటింగు చేయడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అభిమానులంతా పెద్ద సంఖ్యలో లొకేషన్ కు వచ్చేస్తుంటారు. తమ అభిమాన హీరోను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకూ స్టార్ హీరోల సినిమాలను స్టూడియోలోనే సెట్లు వేసేసి తీసేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచపటాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా ప్రభాస్ వంటి హీరోతో విదేశాల్లో అవుట్ డోర్ షూటింగు ఉన్నా ఇక్కడి పరిస్థితే ఉండటం విచిత్రం.

ప్రభాస్ తో 'రాధే శ్యామ్' సినిమాను విదేశాల్లో తీయడం చాలా కష్టమైందని ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'రాధేశ్యామ్' సినిమా విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎక్కడ ఏ సెట్ అయినా పూర్తిగా తయారైన తరువాతనే ఓకే చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు దేని కోసం వెతుకులాట అనేది లేకుండా చూసుకున్నాము. ఇటలీతో పాటు ఇతర దేశాలకి వెళ్లినప్పుడు ప్రభాస్ హ్యాటు .. స్పెట్స్ పెట్టేసి సాధ్యమైనంత వరకూ ఎవరూ గుర్తుపట్టకుండా చేసేవాళ్లం. కానీ ఎక్కడైనా కాఫీ తాగుతూనో .. ఐస్ క్రీమ్ తింటూనో అక్కడి జనాలకు దొరికిపోయేవారు.

'ఏంటి డాళింగ్ ఇక్కడ కూడా ..' అని ప్రభాస్ అనేవారు. మేము ఉన్న సిటీలో వాళ్లకి ప్రభాస్ షూటింగు అక్కడ జరుగుతుందనే విషయం తెలిసిపోయింది. అందువలన మేము వేరే సిటీలో ఉన్న పబ్ కి వెళదామని ఒక రోజున ప్లాన్ చేశాము. అక్కడి పబ్ లు అర్థరాత్రి ఒంటి గంట తరువాత మొదలవుతాయి. ఆ సమయంలో కూడా అభిమానులు ఆయనను పట్టేసుకున్నారు. అక్కడ కూడా ఆయనకి ప్రైవసీ లేకపోవడం చూసి నాకు చాలా బాధేసింది. హైద్రాబాద్ .. ముంబైలోనే కాదు .. ఎక్కడో దేశంకాని దేశంలో మారుమూల ప్రాంతానికి వెళ్లినా కూడా ప్రభాస్ ని వదల్లేదంటే మేము ఆశ్చర్యపోయాము.

ఆయన కటౌట్ మామూలు కటౌట్ కాదు .. మంచి హైట్ .. సూటు బూటు వేసుకుని .. హాలీవుడ్ హీరోలా కనిపిస్తూ ఉండటంతో వెంటనే గుర్తుపట్టేస్తూ ఉండేవారు. ఇటలీలో అయితే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉంటుంది .. అక్కడైతే హాయిగా షూటింగు చేసుకోవచ్చునని ఆయన అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాతనే అసలు సంగతి అర్థమైంది. ఇంతకుముందు ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉండేవారో .. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇప్పటికీ కాస్త బిడియం ఉంది గానీ .. ఈ మధ్యనే జోకులు కూడా బాగా వేస్తున్నారు. తనతో ఉన్నవాళ్లందరినీ ఆయన సమానంగా చూస్తారు. ఒకసారి అయితే అన్ని డిపార్టుమెంట్లవారికీ పీజా ఆర్డర్ చేశారు. ఎంతమంది తిన్నారో .. నేనైతే ఆశ్చర్యపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News