పెద్ద హిట్టు కొట్టారు.. ఎందుకీ ఫేక్?

Update: 2023-01-07 15:30 GMT
మాస్ రాజా రవితేజ కెరీర్‌కు అత్యావశ్యక విజయాన్ని అందించింది ‘ధమాకా’ సినిమా. ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ లాంటి డిజాస్టర్ల తర్వాత రవితేజ కెరీర్ ప్రమాదంలో పడ్డ స్థితిలో ఈ సినిమా గత ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదలై ఊహించని విజయాన్నందుకుంది. నిజానికి ఈ సినిమా విడుదల ముంగిట ఏమంత బజ్ కనిపించలేదు. దీనికి తోడు డివైడ్ టాక్ రావడంతో సినిమా సక్సెస్ కావడం కష్టమే అనుకున్నారు.

కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వీకెండ్ తర్వాత కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. రెండో వీకెండ్లో ‘ధమాకా’ హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం చూసి చాలా మంది షాకైపోయారు. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఇలా అదరగొట్టే సినిమాలను అరుదుగా చూస్తుంటాం. ఇందుకు చిత్ర బృందం ఎంత సంతోషించి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

ఐతే ఈ విజయాన్ని తక్కువ చేసేలా చిత్ర బృందమే తప్పుడు మార్గంలో వెళ్తుండడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా సాధించిన వసూళ్లను మించి ప్రతి రోజూ అదనంగా కలుపుతూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. తొలి వీకెండ్లో అంతే ప్రచారం కోసం కొంచెం హడావుడి చేస్తున్నారులే అనుకున్నారు. కానీ వీక్ డేస్‌లో కూడా అదే రేంజిలో కలెక్షన్లను ప్రకటిస్తూ పోయారు. తాజాగా ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల మార్కును అందుకున్నట్లుగా పోస్టర్ దించేశారు.

నిజానికి టాలీవుడ్లో పర్ఫెక్ట్ కలెక్షన్లను ఎవ్వరూ ప్రకటించరు. సరైన ట్రాకింగ్ సిస్టమ్ లేకపోవడం అందుక్కారణం. ఐతే కొన్ని బాక్సాఫీస్ వెబ్ సైట్లు ఉన్నంతలో కాస్త బెటర్ అనిపించేలా వసూళ్లను ప్రకటిస్తుంటాయి. ఆ సైట్లు ప్రకటించిన ఏ జాబితాలోనూ ‘ధమాకా’ రూ.75 కోట్ల మార్కును కూడా దాటినట్లు లేదు. వసూళ్లు అటు ఇటుగా రూ.70 కోట్ల దాకా వచ్చినట్లు తెలుస్తోంది. దానికి మరీ 30 కోట్లు పలికి పోస్టర్లు దించేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. నిఖార్సయిన హిట్టు కొట్టి.. ఇలా ఫేక్ కలెక్షన్లు ప్రకటించడం అంటే తమ సినిమాను తామే కించపరుచుకున్నట్లే కదా?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News