చిన్న చిత్రాన్ని భుజానికెత్తుకున్న జాతిరత్నం.. ఈసారి అదే స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దా?

Update: 2022-07-26 02:30 GMT
'పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కేవీ.. 'జాతిరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రెండో సినిమాతోనే క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ ని తెలుగులో లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలానే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

'ఫస్ట్ డే ఫస్ట్ షో' చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించలేదు కానీ.. దానికి కథ - స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా తనదైన శైలిలో వెరైటీగా ప్లాన్ చేస్తుండటం గమనార్హం.

'జాతిరత్నాలు' సినిమా విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం దర్శకుడు అనుదీప్ అని చెప్పాలి. ప్రమోషన్స్ లో భాగంగా అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో బాగా పాపులర్ అయ్యాడు.

అమాయకుడి వలె ప్రవర్తిస్తూ.. తిక్క తిక్క సమాధానాలు చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు అనుదీప్. ఇవన్నీ సినిమాపై సందడి నెలకొనడానికి కారణమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు అదే స్ట్రాటజీని 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాకి ఫాలో అవుతున్నాడీ జాతిరత్నం.

'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమాతో అనుదీప్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వంశీధర్ గౌడ్ మరియు లక్ష్మీ నారాయణ డైరెక్టర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, ఏడిద శ్రీరామ్ కుమార్తె శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అనుదీప్ ఈ సినిమాలో భాగం అవడం.. తన శిష్యులకు సపోర్ట్ గా ఉండటం కోసం ప్రచార కార్యక్రమాలన్నింటినీ తన భుజాలపై వేసుకున్నాడు. 'జాతిరత్నాలు' శైలిలోనే జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ లాంచ్ కు సంబంధించి చిత్ర బృందంతో చేసిన ఇంటర్వ్యూ నెట్టింట సందడి చేసింది.

ఇదే క్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో ఇంకా చిత్రీకరించిన ఓ సాంగ్ ను లాంచ్ చేయించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. గీతా ఆర్ట్స్ ఆఫీసులో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' టీమ్ చేసిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూకి నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా గురించి 'బాహుబలి' రేంజ్ లో వివరించడం.. టై అప్ అవుదాం అంటూ అగ్ర నిర్మాతతో డీల్ మాట్లాడటం వంటివి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

మొత్తం మీద 'జాతిరత్నాలు' సినిమా స్ట్రాటజీనే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి అన్వయిస్తున్నాడు అనుదీప్. ప్రతీసారి ఇలాంటి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయని చెప్పలేం. ఆ సినిమాకు కుదిరినట్టు అన్నీ కుదురుతాయని చెప్పలేం. అందులోనూ అక్కడ వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ మరియు నాగ్ అశ్విన్ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్యాక్ బోన్ గా ఉన్నారు. కానీ ఈ సినిమా విషయం వేరు.

పూర్ణోదయ పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో బ్యానర్ లో రూపొందుతున్న సినిమా ఇది. అనుదీప్ కేవీ ఒక్కడే జనాల దృష్టిని ఆకర్షించే అంశం. ఇందులో శ్రీకాంత్ రెడ్డి - సంచితా బాషు ప్రధాన పాత్రలు పోషించారు. తనికెళ్ల భరణి - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - సీవీఎల్ నరసింహారావు - ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం జాతిరత్నం ప్లాన్ చేస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీ ఏ మేరకు జనాలను థియేటర్లకు రప్పిస్తుందో.. అనుదీప్ కేవీ అండ్ టీమ్ కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
Tags:    

Similar News