పులిని చూసి న‌క్క వాత‌పెట్టుకోవ‌డం అంటే ఇదేనా?

Update: 2022-10-01 01:30 GMT
రాజ‌మౌళి ఏ క్ష‌ణాన `బాహుబ‌లి`ని రూపొందించాడో కానీ ఈ మూవీని త‌ల‌ద‌న్నే సినిమాని చేయాల‌ని అటు బాలీవుడ్ వ‌ర్గాలు.. ఇటు కోలీవుడ్ వ‌ర్గాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయితే పులిని చూసి న‌క్క వాత‌పెట్టుకున్న చందంగా వారి ప‌రిస్థితి మారుతోంది. ఎంత భారీగా ప్ర‌య‌త్నాలు, భారీ సెట్టింగులు, కోట్ల ఖ‌ర్చు చేస్తూ భారీ తారాగ‌ణంతో సినిమాలు చేస్తున్నా రాజ‌మౌళి స్థాయిలో ఆక‌ట్టుకోలేక దారుణంగా బాక్సాఫీస్ వ‌ద్ద విఫ‌ల‌మ‌వుతున్నారు.

త‌మిళంలో విజ‌య్ హీరోగా శ్రీ‌దేవి ప్ర‌ధాన పాత్ర‌లో `పులి` అనే పేరుతో ఫాంట‌సీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ని `బాహుబ‌లి` త‌రువాత రిలీజ్ చేశారు. చింబు దేవ‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దాదాపుగా రూ. 130 కోట్లు ఖ‌ర్చు చేశారు. శృతిహాస‌న్‌, హ‌న్సిక హీరోయిన్ లుగా న‌టించారు. శ్రీ‌దేవిని కీల‌క పాత్ర కోసం తీసుకొచ్చినా క‌థ‌లో ద‌మ్ములేక‌పోవ‌డం, భావోద్వేగాల‌ని బ‌లంగా తెర‌పై ఆవిష్క‌రించ‌క‌పోవ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచి మేక‌ర్స్ కి భారీ న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది.

విజ‌య్ క్రేజ్ కార‌ణంగా కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించే స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇక బాలీవుడ్ లో ఇదే పంథాని ఫాలో అవుతూ `బాహుబ‌లి` స్ఫూర్తితో `క‌లంక్‌` అనే సినిమాని భారీ బ‌డ్జెట్ తో క‌ర‌ణ్ జోహార్, సాజిద్ న‌దియావాలా నిర్మించారు. మాధురీ దీక్షిత్‌, సంజ‌య్ ద‌త్, అలియాభ‌ట్‌, వ‌రుణ్ ధావ‌న్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్ వంటి స్టార్స్ న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

ఆ త‌రువాత చేసిన `ప‌థ్వీరాజ్‌`, రీసెంట్ గా విడుద‌లైన `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రాల ప‌రిస్థితి కూడా ఇదే స్థాయిలో వుంది. `బాహుబ‌లి` స్థాయిలో ఆక‌ట్టుకోవాల‌ని చేసిన వీరి ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌లేదు. తాజాగా మ‌ణిర‌త్నం కూడా ఇదే ఫార్ములాని న‌మ్ముకుని చేసిన సినిమా `పొన్నియిన్ సెల్వ‌న్‌`. రెండు భాగాలుగా తెర‌కెక్కిన ఈ మూవీపై మ‌ణిర‌త్నంతో పాటు త‌మిళ ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. త‌మిళ ప్రేక్ష‌కులు మాత్రం దీన్నో బాహుబ‌లికి బాప్ అంటూ ప్ర‌చారం చేశారు.

మా నుంచి కూడా బాహుబ‌లి వ‌స్తోందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేశారు. `బాహుబ‌లి` పై కామెంట్ లు చేశారు కూడా. అయితే ఈ శుక్ర‌వారం విడుద‌లైన `పొన్నియిన్ సెల్వ‌న్ 1` ఏ విష‌యంలోనూ `బాహుబ‌లి`తో పోటీప‌డ‌లేక‌పోయింది. ఒక్క‌టంటే ఒక్క స‌న్నివేశం కూడా ఓహో అని చెప్పుకోవ‌డానికి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా `బాహుబ‌లి`లో వున్న ఎమోష‌న్స్ కూడా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా ఫ‌లితాన్ని గ‌మ‌నించిన వారంతా మ‌ణిర‌త్నం మాస్ట‌ర్ అది వేరే విష‌యం.. కానీ రాజ‌మౌళి మాత్రం ఎమోష‌న్స్ ని ప‌ట్టుకోవ‌డంలో మాస్త‌ర్ అని అతన్ని అనుక‌రించే ప్ర‌య‌త్నం అంటే పులిని చూసి న‌క్క వాత పెట్టుకోవ‌డ‌మే అవుతుంద‌ని ఈ సినిమా ఫ‌లితం నిరూపించింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News