స్టార్ ప్రొడ్యూస‌ర్ అత్యుత్సాహ‌మే బెడిసికొట్టిందా?

Update: 2022-07-24 00:30 GMT
కొన్ని సార్లు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే న‌ష్ట‌పోతుంటాం. కానీ కొన్ని సార్లు అతి జాగ్ర‌త్త వ‌ల్ల కూడా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంటుంది. ఇది తాజాగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విష‌యంలో రుజువైంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ `థాంక్యూ`. నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కించారు. రాశీఖన్నా, మాళ‌విక మోహ‌న‌న్‌, అవికా గోర్ హీరోయిన్ లుగా న‌టించారు. వివిధ ద‌శ‌ల్లో సాగే ఓ యువ‌కుడి జీవన ప్ర‌యాణం నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు.

`బంగార్రాజు` త‌రువాత నాగ‌చైత‌న్య న‌టించిన మూవీ కావ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం భారీ స్థాయిలో ఈ మూవీని విడుద‌ల చేశారు. అయితే రిలీజ్ కు ముందు రోజు ఏపీలోని కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేశారు. ముందే టాక్ బ‌య‌టికి రావ‌డంతో ఈ మూవీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబ‌ట్టాల్సిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక పోయింది.

ముందు నుంచి ఈ మూవీపై పాజిటివ్ బ‌జ్ క్రియేట్ కాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాత దిల్ రాజు అడ్వాన్స్డ్ ప్రీమియ‌ర్స్ ని నైజాంలో అందులోనూ హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌కుండా ఏపీలో ఏర్పాటు చేసి అతి జాగ్ర‌త్త ప‌డ్డార‌ని, అదే ఈ సినిమాకు బిగ్ షాక్ గా మారింద‌ని అంటున్నారు.

అంతే కాకుండా ఏపీలో ప్రీమియ‌ర్ షోస్ గురువారం రోజే ప‌డిపోవ‌డంతో నెగెటివ్ టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో శుక్ర‌వారం సినిమాకు వెళ్లాల‌నుకున్న చాలా మంది ప్రేక్ష‌కులు ఆ ప్ర‌య‌త్నాల‌ని విర‌మించుకున్నార‌ట‌.

దీని కార‌ణంగా చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఈ మూవీకి 20 శాతానికి మించి ఆక్యుపెన్సీ ద‌క్క‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇంత వ‌ర‌కు నాగ‌చైత‌న్య సినిమాకు ఈ స్థాయి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం ఇదే మొద‌టి సార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య న‌టించిన `బంగార్రాజు, `ల‌వ్ స్టోరీ` చిత్రాల‌కు మంచి ఓపెనింగ్స్ ల‌భించాయి.

అయితే `థాంక్యూ` సినిమాకు మాత్రం అందులో స‌గం కూడా రాక‌పోవ‌డం విచిత్రంగా వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నాయి. కోవిడ్ త‌రువాత విడుద‌లైన `బంగార్రాజు, `ల‌వ్ స్టోరీ` చిత్రాల‌కు మంచి ఓపెనింగ్స్ ల‌భిస్తే `థాక్యూ`కు ఇలా ఎందుకు జ‌రిగింద‌ని, లోపం ఎక్క‌డ జ‌రిగింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News