హాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్.. కాలు తీసేశారు

Update: 2020-05-01 04:15 GMT
సామాన్యుడు మొదలు సెలబ్రిటీ వరకూ ఎవరికి విడిచి పెట్టకుండా.. మనుషులంతా తనకు ఒక్కటే అన్నట్లు వ్యవహరిస్తోంది మాయదారి కరోనా. తనను టచ్ చేసిన వారు ఎవరైనా.. ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టకుండా అంటేసే కరోనా.. తాజాగా ఒక హాలీవుడ్ నటుడికి కాలు పోయేలా చేసింది. కరోనాతో కాలు పోవటం ఏమిటన్న క్వశ్చన్ రావొచ్చు. కానీ.. విషయమంతా తెలిస్తే షాక్ కు గురి కావటం ఖాయం.

పేరుకు కరోనానే అయినా.. ఆ వైరస్ వ్యాప్తి కొందరిలో కొన్ని విధాలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకే వారందరికి ఒకేలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కొందరికి తీవ్రమైన జ్వరంతో బాధ పడితే.. మరికొందరు గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు. మరి కొందరికి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. హాలీవుడ్ నటుడు ఒకరు కరోనా కారణంగా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

అమెరికాకు చెందిన 41 ఏళ్ల నిక్ కార్డెరో ఇటీవల కరోనా బారిన పడ్డారు. అతన్ని లాస్ ఏంజెలిస్ లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. మూడు వారాలు ఐసీయూలో గడిపాడు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. కుడికాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో కలిసి ప్రవహిస్తూ ఊపిరితిత్తుల్లోకి చేరితే.. గుండె పోటు వచ్చి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి.
దీంతో.. మరో మార్గం లేని వేళ.. వైద్యులు ఆ నటుడి కుడి కాలిని తొలగించేసి.. ఇన్ఫెక్షన్ కు అడ్డుకట్ట వేశారు. కరోనా వైరస్ సోకిన వారందరికి ఒకేలాంటి ఆరోగ్య సమస్యలు రావనటానికి ఈ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. మరో వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఏర్పడిన నేపథ్యంలో అతడి చేతి వేలిని తీసేశారు వైద్యులు. ఈ ఉదంతం న్యూయార్క్ లో చోటు చేసుకుంది.
Tags:    

Similar News