అందాల నిధికి అసలు తత్త్వం బోధపడినట్టులేదే!

Update: 2022-09-05 09:35 GMT
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథనాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. హైదరాబాదులో పుట్టిన ఈ అమ్మాయి పెరిగిదంతా బెంగుళూరులోనే. 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. ఈ సినిమా చూసిన కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. ఇంతకాలం పాటు ఈ అందాల చందమామ ఎక్కడ ఉందంటూ ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది.

రెండు ఫ్లాపుల తరువాత వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను నమోదు చేసింది. ఈ సినిమా ఈ స్థాయి హిట్ అయితే ఈ పిల్ల ఎగిరి గంతేస్తుందని అనుకుంటే .. ఆమె మాత్రం లైట్ తీసుకుంది. అందాన్ని వెతుక్కుంటూ అవకాశాలు అవే వస్తాయిలే అనుకుంటూ కొలీవూడ్ వెళ్లి అక్కడ ఓ రెండు సినిమాలను చక్కబెట్టింది. ఆ తరువాత తాపీగా వచ్చి కొత్త కుర్రాడు అశోక్ గల్లాతో 'హీరో' సినిమా చేసింది. ఆ సినిమాను ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. అయినా ఈ అమ్మాయి పెద్దగా ఫీలైనట్టుగా కనిపించలేదు.

అలాగే సెట్స్ పై ఉన్న 'హరి హర వీరమల్లు' సినిమాను గురించిన టెన్షన్ కూడా ఆమెలో కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టు సెట్స్ పై ఉంటే అది ఎప్పుడు పూర్తవుతుందా .. ఆ సినిమాతో ఏ స్థాయిలో మార్కెట్ పెరుగుతుందా అన్ని అంతా ఎదురు చూస్తుంటారు.

కానీ అలాంటి విషయాలను మనం పెద్దగా పట్టించుకోమన్నట్టుగా నిధి వ్యవహరించడం ఆశ్చర్యం. పోనీ వేరే ప్రాజెక్టులను చకచకా ఒప్పేసుకుంటుందా అంటే అదీ లేదు. ఏ కొత్త ప్రాజెక్టులలోను ఆమె పేరు వినిపించడం లేదు. మిగతా భాషల్లోను ఆమె ఇదే పద్ధతిని కొనసాగిస్తుండటం విశేషం.

నిజానికి ఈ మధ్య కాలంలో వచ్చిన కథానాయికలలో అందచందాల విషయంలో నిధి ముందువరుసలోనే కనిపిస్తుంది. చక్కని కనుముక్కు తీరుతో తెరపై పౌర్ణమి నాటి చందమామలా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ స్థాయి హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇంతలేసి అందాలున్నా ఆమె అవకాశాల కోసం ఎంతమాత్రం ప్రయత్నించకపోవడం విశేషం.

తనకంటే వెనకొచ్చిన వారు ముందుకెళుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు. గ్లామర్ ఉండగానే క్రేజ్ సంపాదించుకోవాలి, క్రేజ్ ఉండగానే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి అనే విషయం ఈ అమ్మడికి ఎవరూ చెప్పలేదా? చెబితే వినిపించుకోవడం లేదా?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News