నాని.. పవన్.. బన్నీలను దాటేసి...

Update: 2017-07-22 06:21 GMT
సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్న నాని.. తాజాగా ‘నిన్ను కోరి’ లాంటి క్లాస్ లవ్ స్టోరీతో కూడా తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. తొలి వీకెండ్లోనే 8 లక్షల డాలర్లు.. వారం అయ్యేసరికే మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం.. సెకండ్ వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకుని మంచి వసూళ్లే రాబట్టింది. ప్రస్తుతం యుఎస్ లో ‘నిన్ను కోరి’ వసూళ్లు.. 1.167 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రూపాయల్లో అంటే.. రూ.7.39 కోట్లన్నమాట. ఈ ఏడాది పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ల సినిమాల వసూళ్లను కూడా నాని చిత్రం దాటేయడం విశేషం.

గత నెలలోనే భారీ అంచనాలు.. హంగామా మధ్య విడుదలైన బన్నీ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ యుఎస్ లో 1.143 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ‘కాటమరాయుడు’ ఫుల్ రన్లో 1.145 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో 4-5 స్థానాల్లో ఉన్న ఈ రెండు సినిమాలనూ ‘నిన్ను కోరి’ దాటేసింది. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ నాలుగో స్థానానికి ఫిక్సయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా 20 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసి ఈ ఏడాది యుఎస్ లో హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. చిరు సినిమా ‘ఖైదీ నంబర్ 150’ 2.446 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. బాలయ్య మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 1.663 డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ‘నిన్ను కోరి’ ఇంతకుమించి పైకి వెళ్లే అవకాశాలు లేనట్లే. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్ల మార్కు దగ్గర ఫిక్స్ కావచ్చేమో. నాని కెరీర్లో ‘భలే భలే మగాడివోయ్’ అత్యధికంగా 1.43 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అమెరికాలో.
Tags:    

Similar News