ఏంటి కాలా ఈ పరిస్థితి?

Update: 2018-06-06 13:11 GMT
నిజంగానే సూపర్ స్టార్ రజినికాంత్ కెరీర్ లో చాలా వీక్ ఓపెనింగ్స్ తెచ్చుకునే దిశగా కాలా అడుగులు వేస్తోంది. పేరుకి తమిళ హీరో అయినప్పటికీ రజినికి ఇక్కడ  అశేషమైన ఫాలోయింగ్ ఉంది. బాషా తర్వాత సూపర్ స్టార్ ఇమేజ్  ఆకాశం హద్దుగా ఇక్కడ కూడా అలా అలా ఎగబాకుతూనే ఉంది. కబాలి వరకు కూడా అదే పరిస్థితి. రోబోకు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు వేసిన ఉదంతాలు ఉన్నాయి. నరసింహ-అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్స్ వంద రోజుల వేడుకలు కూడా జరుపుకున్నాయి. అలాంటిది మరికొద్ది గంటల్లో కాలా విడుదల అవుతోంది అన్న సందడి రెండు రాష్ట్రాల్లో కొంచెం కూడా కనిపించడం లేదు. దానికి తోడు ప్రమోషన్ విషయంలో వహించిన నిర్లక్ష్యం ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తోంది. ఏదో మొక్కుబడిగా రజనితో పాటు టీమ్ ని  తీసుకొచ్చి మినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసారు కానీ  దాని వల్ల ఒరిగిన ప్రయోజనం శూన్యం. జనం రజని సినిమా విషయంలో ఇంత నిరాసక్తంగా ఉండటం గతంలో జరగలేదు. రజని యానిమేషన్ బొమ్మతో తీసిన విక్రమసింహకు అప్పట్లో ఇంత కన్నా ఎక్కువ బజ్ వచ్చిందనడం అబద్దం కాదు.

కర్ణుడి చావుకు వేయి కారణాలు అన్నట్టు కాలాకు ఇంత లో బజ్ ఉండడానికి చాంతాడంతా లిస్ట్ ఉంది. ఆడియోలో 8 పాటలు ఉన్నప్పటికీ టైటిల్ సాంగ్ తో సహా ఒక్కటంటే ఒక్కటి ట్రెండింగ్ లో లేకపోవడం తలైవా ఫాన్స్ కి షాక్ కలిగించేదే. చిన్న చిన్న టీజర్లకే నానా హడావిడి చేస్తున్న రోజుల్లో చడీచప్పుడు కాకుండా కాలాను అలా గాలికి వదిలేయడం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో ఎక్కడా ఫస్ట్ డే షోస్  అన్ని ఇంకా ఫుల్ కాలేదు. టికెట్స్ దొరుకుతున్నాయి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే రేపు ఎక్కడైనా టికెట్ గ్యారెంటీ అనేలా ఉంది పరిస్థితి. దయనీయం ఏంటంటే సాధారణ జనానికి కాలా విడుదల గురించే అవగాహన లేకపోవడం.

సినిమా బాగున్నా లేకున్నా మొదటి రోజు వసూళ్లు దక్కాలంటే దాన్ని ప్రేక్షకుల  మనసులో పొజిషన్ చేయటం చాలా అవసరం. ఎంత రజని అయినా చెప్పే రీతిలో చూసేవాళ్లకు చేరువ కాకపోతే పట్టించుకునే వారు ఉండరు. దానికి తోడు ట్రైలర్  కబాలి ఛాయల్లో ఉండటంతో పాటు  రెగ్యులర్ డాన్ ఫార్ములా సినిమా అనే ఇంప్రెషన్ కలగడం రేపే చూసి తీరాలన్న టెంప్టేషన్ ను ఆపేస్తోంది . ఫలితమే డల్ గా ఉన్న అడ్వాన్స్ బుకింగ్. తమిళనాడులో సైతం కాలా టికెట్ల కోసం కొట్టుకునే పరిస్థితి లేదు. అదే అభిమానులకు జీర్ణం కానీ విషయం. అసలే కర్ణాటకలో విడుదల నిషేధించారు. దానికి తోడు ఇలా నెగటివ్ ప్రీ రిలీజ్ టాక్ తో రేపు ఏ మాత్రం తేడా వచ్చినా మొహమాటం లేకుండా తిట్టిపోయడానికి ఫాన్స్ సైతం రెడీ గా ఉన్నారు. మరి కాలా రజని బ్యాడ్ పీరియడ్ కి చెక్ పెట్టి తలైవా ఈజ్ బ్యాక్ అంటుందో లేక 2.0 వచ్చే దాకా ఎదురుచూపులు తప్పవు అనే సందేశం ఇస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News