ఫ్యూచర్ అంతా డిజిటల్ సినిమానేనా!!

Update: 2018-07-02 08:33 GMT
ఏమో కమల్ హాసన్ పదేళ్ల క్రితం జోస్యం చెప్పినట్టుగా రానున్న రోజుల్లో సినిమా ప్రపంచం నట్టింట్లోకి వచ్చి డిజిటల్ మయం అయ్యేలా ఉంది. సినిమా విడుదలైన 50 రోజుల లోపే రంగస్థలం-భరత్ అనే నేను-మహానటి లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్స్ అన్ని ఆన్ లైన్ లో హెచ్ డి క్వాలిటీతో చూసేయాల్సి రావడం చూస్తుంటే అది జరగక తప్పేలా లేదు. నిన్నా మొన్నటి దాకా కొత్త సినిమాలకు థియేట్రికల్ రైట్స్ కాకుండా ఉన్న ప్రధాన ఆదాయ వనరు ఒక్క శాటిలైట్ మాత్రమే. ఇప్పుడు దాన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆక్రమించేలా ఉంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికీ ఈ రంగంలో స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తుండగా నెట్ ఫ్లిక్స్ సైతం రీజనల్ సినిమా కంటెంట్ మీద దృష్టి పెడుతోంది.

కొత్త సినిమాలను వాటి ఫలితంతో సంబంధం లేకుండా అద్భుతమైన క్వాలిటీతో ఒప్పందంలో రాసుకున్న గడువు ప్రకారం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా విడుదల చేస్తున్న ఈ సంస్థల బాటలోనే సాంప్రదాయ ఛానల్ రంగంలో ఉన్న జీ-సన్ లాంటి నెట్ వర్క్స్ కూడా ప్రత్యేకంగా వీడియో స్ట్రీమింగ్ యాప్స్ రూపొందించడం విశేషం. అజ్ఞాతవాసి హక్కులను కొన్న సన్ నెట్ వర్క్ టీవీలో కంటే ముందే యాప్ లో పెట్టేయడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇప్పటికిప్పుడు శాటిలైట్ కు కాలం చెల్లింది అని చెప్పలేం కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఇంటింటా స్మార్ట్ టీవీలు వైఫై నెట్వర్క్ లు సాధారణం అయిపోయాయి. అలాంటప్పుడు యాడ్స్ తో విసిగిస్తూ రెండున్నర గంటల సినిమాని మూడు గంటలకు పైగా చూడాల్సి వచ్చే ప్రహసనానికి స్వస్తి పలుకుతూ మనకు అనుకూలమైన సమయంలో సినిమా చూసుకునే వెసులుబాటు ఇచ్చే డిజిటల్ యాప్స్  వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడంలో ఆశ్చర్యం లేదు.

అందుకే అమెజాన్ ప్రైమ్ పెట్టుబడుల విషయంలో రాజీ లేని ధోరణి అవలంబిస్తోంది. డిజిటల్ సినిమా గురించి ఇంకా సామాన్యులకు పూర్తి అవగాహన లేకపోయినా కొత్త సినిమాలను విడుదల చేయటం ద్వారా ఇది ఏంటి అనే ఆసక్తిని రేకెత్తించి నేర్చుకునేలా చేస్తోంది. ఈ మధ్య గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్ ని సినిమా తరహాలో టీవీ చానెల్స్ లో ప్రమోట్ చేయటం చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. అందుకే తమకు సరికొత్త ఆదాయ వనరుగా మారిన డిజిటల్ హక్కుల వైపు నిర్మాతలు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. సినిమా షూటింగ్ మొదటి రోజే దీనికి సంబంధించిన ఒప్పందాలు జరగడం పరిస్థితి చెప్పకనే చెబుతోంది.  ఇది రానున్న కాలంలో చాలా మార్పులకు దారి తీస్తుందని విశ్లేషకుల అంచనా. డిజిటిల్ సినిమా యుగం  ఇంకా ఎలాంటి పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందో వేచి చూడాలి.
Tags:    

Similar News