మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల కాంబోలో తెరకెక్కిన `అత్తారింటికి దారేది` సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ ప్రణీత ఇంట్రో సీన్ లో `దేవ దేవం భజే....దివ్య ప్రభాతం.....`కీర్తన సూపర్ హిట్ అయింది. దానిని స్ఫూర్తిగా తీసుకొని `అజ్ఞాతవాసి` చిత్రంలో `మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా` అనే కీర్తనను కీర్తి సురేష్ ఇంట్రో సీన్ లో వాడేశాడు త్రివిక్రమ్. అయితే, `అత్తారింటికి దారేది` సెంటిమెంట్ `అజ్ఞాతవాసి`కి వర్కవుట్ కాలేదు. దీంతో, తాజాగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న `అరవింద సమేత` చిత్రంలోనూ కీర్తన సెంటిమెంట్ ను త్రివిక్రమ్ కొనసాగిస్తాడా లేదా అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్....ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. `అరవింద సమేత`లొ కీర్తన ఉండబోదని చెప్పాడు.
`అజ్ఞాతవాసి` డిజాస్టర్ అయిన చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ సినిమాను కార్పొరేట్ బిజినెస్ స్టోరీ తరహాలో తెరకెక్కించానని....ఆ సినిమా పరాజయం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. `అజ్ఞాతవాసి`లో కీర్తన పాట హిట్ అయినా....సినిమా హిట్ కాలేదని అన్నాడు. అదీగాక, `అరవింద సమేత` స్క్రిప్ట్ లో ఆ తరహా పాట లేదని చెప్పాడు. అయితే, అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోయి....విజయాలు వచ్చినపుడు పొంగిపోయే వ్యక్తిని తాను కాదని అన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటానని అన్నాడు. అపజయం ఎదురైనప్పుడు మరింత ఎక్కువ పనిచేస్తే...ఆ ఆలోచన నుంచి బయటపడవచ్చని, ప్రస్తుతం `అరవింద సమేత` చిత్రం తెరకెక్కిస్తూ తాను అదే పని చేస్తున్నానని అన్నాడు.