రామ్ చరణ్ ప్లేస్ లో చిరంజీవి వచ్చి ఉంటే..?
ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి ముగ్గురు అగ్ర హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగారు.
ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి ముగ్గురు అగ్ర హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగారు. ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. వాటిల్లో 'గేమ్ ఛేంజర్' మూవీకి మిశ్రమ స్పందన లభించగా.. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు హిట్ టాక్ వచ్చింది. దీంతో నందమూరి, దగ్గుబాటి అభిమానులు హ్యాపీగా ఖుషీలో ఉండగా.. మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశలో ఉన్నారు. అదే ఈ ఫెస్టివల్ కి మెగాస్టార్ వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అని ఆలోచిస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. అందరి కంటే ముందే 2025 జనవరి 1వ తారీఖున వస్తామని ప్రకటించిన మూవీ టీమ్ ఇదే. కానీ చివరి నిమిషంలో 'గేమ్ ఛేంజర్' సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిస్మస్ కు ప్లాన్ చేసిన రామ్ చరణ్ సినిమాని పొంగళ్ కు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో తనయుడి కోసం చిరు తన సినిమా విడుదల తేదీని త్యాగం చేశారు. నిర్మాతలు కూడా చరణ్ కు స్నేహితులు అవ్వడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
'విశ్వంభర' వాయిదా పడడంతో అదే డేట్ కి 'గేమ్ ఛేంజర్' రావడం.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడం జరిగిపోయాయి. ఒకవేళ ముందుగా అనుకున్నట్లు సంక్రాంతికి 'విశ్వంభర' సినిమా వచ్చింటే, ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి ముగ్గురు సూపర్ సీనియర్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సినీ ప్రియులకు కూడా అసలైన మజా ఉండేదని అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు పొంగల్ వార్ లో కచ్ఛితంగా మెగాస్టార్ విన్నర్ గా నిలిచి ఉండేవారని అంటున్నారు.
ఇదిలా ఉంటే, 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి పండగకు కాకుండా, ముందుగా అనుకున్నట్టు క్రిస్మస్ కు లేదా మరేదైనా వేరే డేట్ లో సోలోగా వచ్చి ఉంటే బాగుండేదేమో అనే చర్చలు కూడా ఫ్యాన్స్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి. సినిమాలో కంటెంట్ మారకపోయినా, క్లాష్ లేకుండా వచ్చి ఉంటే కాస్త బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అని ఆలోచిస్తున్నారు. గతేడాది కల్కి, దేవర, పుష్ప-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఎలాంటి పోటీ లేకుండా సోలోగా వచ్చాయి. కానీ ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మాత్రం కాంపిటీషన్ లో వచ్చింది. తమిళంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఎలాంటి పోటీ లేకపోవడం వల్ల ఉన్నంతలో హిందీలో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు పర్వాలేదనిపించాయని.. పాన్ ఇండియా వైడ్ గా 'గేమ్ ఛేంజర్' సోలోగా రిలీజు అయ్యుంటే గేమ్ చేంజ్ అయ్యేదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు ప్రమోషన్స్ గట్టిగా చేయకపోవడం దెబ్బ కొట్టిందని కూడా అంటున్నారు. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, హీరోయిన్ కియారాతో సహా మిగిలిన చిత్ర బృందం విడుదలకు ముందు దూకుడుగా ప్రచారం చేయకపోవడం ప్రతికూలంగా మారిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.