బేబి జోడీ.. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్
బేబీ జోడీ ప్రధాన పాత్రల్లో ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది.
గత కొన్నేళ్లలో తెలుగు నుంచి వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనం అంటే.. ‘బేబి’నే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లాంటి అప్ కమింగ్ ఆర్టిస్టులను పెట్టి దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న సాయిరాజేష్ రూపొందించిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. ఆ తర్వాత ఆనంద్-వైష్ణవి ప్రధాన పాత్రల్లో రవి నంబూరి అనే కొత్త దర్శకుడితో సాయిరాజేష్ మరో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఈ సినిమా ఏవో కారణాల వల్ల ముందుకు కదల్లేదు. షూట్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ సినిమా నుంచి ఆనంద్, వైష్ణవి బయటికి వచ్చేస్తున్నట్లు.. కిరణ్ అబ్బవరంతో పాటు వేరే హీరోయిన్ని పెట్టి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఐతే ఆ సినిమా సంగతేమో కానీ.. బేబీ జోడీ ప్రధాన పాత్రల్లో ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించిన ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రి టీజర్ చూస్తే ఇదొక ప్లెజెంట్, నోస్టాల్జిక్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ‘నైంటీస్..’ తర్వాత ఆదిత్య మీద పెరిగిన అంచనాలు.. సితార సంస్థకు ఉన్న గుడ్ విల్.. బేబీ జంట అంటే ప్రేక్షకుల్ల ఉండే క్రేజ్.. అన్నీ దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో ప్రశంసలు అందుకున్న మలయాళ సంగీత దర్శకుడు అబ్దుల్ హేషమ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.