ఇప్పుడంతా వెటకారంగా మాట్లాడేవారే ఎక్కువ: నటి సుధ

Update: 2022-02-04 02:30 GMT
తెలుగు తెరకి అందమైన అమ్మను పరిచయం చేసిన నటి సుధ. అక్క .. వదిన పాత్రలను కూడా ఆమె చాలానే పోషించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఆమె తెరపై కనిపిస్తూ ప్రేక్షకులతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా ఆమె 'మాతృదేవోభవ' సినిమాను చేశారు. టైటిల్ రోల్ ను పోషించిన సుధ, ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావిస్తారు.

మొదటి నుంచి కూడా నేను నా పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందనే విషయం చూసుకునే ఒప్పుకునేదానిని. సీన్లో ఒక మూల అలంకారంగా నుంచునే పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి పాత్రలు చేయడానికి సుధ అవసరం లేదు .. చాలామందే ఉన్నారు. అలా ప్రాధాన్యత గల పాత్రలను చేయడం వల్లనే నేను ఇంకా ప్రేక్షకులకు గుర్తున్నాను .. ఇప్పటికీ బిజీగానే ఉన్నాను. ఇక ఈ మధ్యకాలంలో నాకు అవకాశాలు తగ్గాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ చాలావరకూ నేనే వదులుకుంటున్నాను. అందుకు కారణం ఆ పాత్రలు నాకు నచ్చకపోవడమే.

నేను ఎక్కడ .. ఏ సినిమాకి పనిచేస్తున్నా అక్కడున్న వాళ్లంతా నా ఫ్యామిలీ అనుకునే పనిచేస్తూ వచ్చాను. అందువలన నా ఫ్యామిలీని మిస్సవుతున్నాననే ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. యంగ్ హీరోలంతా కూడా నన్ను 'అమ్మా' అనే పిలుస్తారు. ఉదయ్ కిరణ్ కూడా 'అమ్మా' అంటూ నన్ను వదిలేవాడే కాదు. జూనియర్ ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ .. మంచు మనోజ్ వీళ్లందరినీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. 'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగు 'నాచారం' స్టూడియోలో జరుగుతున్నప్పుడు మంచు మనోజ్ ను కూడా తీసుకొచ్చేవారు.

మనోజ్ అన్నం తిననని మారాం చేస్తుంటే వాళ్లమ్మగారు కొట్టేవారు. అప్పుడు 'ఈ మమ్మి నాకు నచ్చడం లేదు .. నేను ఆ మమ్మీ దగ్గరికి వెళ్లిపోతాను' అని నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంది. ఇలా అందరూ నా పిల్లల వంటివారే కదా అనుకోవడం వల్లనే 'మాతృదేవోభవ' చేయగలిగాను. ఈ సినిమాలో ఈ పాత్రను నేను చేయగలనా? అనే అనుకున్నాను. కానీ చేయకపోతే అందరూ కూడా సుధ పనైపోయిందని అనుకుంటారు. ఇప్పుడు ఇలా వెటకారంగా మాట్లాడేవారే ఎక్కువైపోయారు.

 అందువల్లనే ఈ సినిమా చేయాలనే నిర్ణయించుకుని చేశాను. చేయకపోతే మాత్రం ఇప్పుడు చాలా బాధపడి ఉండేదానిని" అని చెప్పుకొచ్చారు
Tags:    

Similar News