తారక్ మాటల్లో అంత అర్థముందా?

Update: 2018-05-02 11:01 GMT
మహానటి ఆడియో వేడుకలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లో అందరిని బాగా ఆలోచింపజేసిన అంశం ఇందులో ఎన్టీఆర్ పాత్ర తను చేయకపోవడం గురించి. పదే పదే తనను చేయమని స్వప్న-ప్రియలు ఫోర్సు చేసారని కానీ తాను మాత్రం నో చెప్పానని చెప్పిన తారక్ అది క్యామియో అయినప్పటికి తనకు అంత దమ్ము లేదని చెప్పడం తాత మీద ఉన్న గౌరవాన్ని ప్రేమను సూచిస్తుంది. అక్కడితో ఆగక తన జీవితంలో తాత చేసిన పాత్రలు జన్మలో చేసే సాహసం చేయనని అంత అర్హత లేదని వినమ్రంగానే చెప్పుకున్నాడు. ఆ మాటల్లో బలమైన ఎమోషన్ కూడా కనిపించింది. కాని ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలోనూ ఇటు అభిమానుల్లో మరో కొత్త రకమైన చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పాత్రను తనే స్వయంగా పోషిస్తుండగా యుక్త వయసులో వచ్చే ఎన్టీఆర్ సీన్స్ కు ఎవరిని పెట్టాలా అనే చర్చ ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నేరుగా బాలయ్యనే టార్గెట్ చేసేవిగా ఉన్నాయని కొన్ని విశ్లేషణలు మొదలుకావడం గమనార్హం. ఎన్టీఆర్ రేంజ్ ఎవరికి లేదని ఒక పక్క తారక్ చెప్పడం మరోపక్క బాలయ్య అదే పాత్రను తాను వేసేందుకు సిద్ధ పడటమే కాక దర్శకత్వ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకునేందుకు సిద్ధపడినట్టు వార్తలు వస్తున్న టైంలో తారక్ అన్న మాటలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించాయి. తనకు తాతయ్య పాత్ర వేసేంత స్థాయి ఈ జన్మకు రాదన్న జూనియర్ మాటలు ఇంకెవరికో వచ్చిందనే మీనింగ్ అందులో చెప్పలేకపోయినా బాబాయ్ కు మాత్రమే ఆ అర్హత ఉందన్న మాట కూడా చెప్పి ఉంటే ఇంత రచ్చ వచ్చేదే కాదు. కాని ఆ ప్రస్తావన తీసుకురాకుండా కేవలం తన గురించి మాత్రమే చెప్పుకున్నా ఎన్టీఆర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తాను తాతయ్యగా నటించే సాహసం చేయలేను అన్న తారక్ మరి పద్దెనిమిది ఏళ్ళ క్రితమే అల్లరి రాముడు సినిమాలో తాత ఎన్టీఆర్ వేటగాడు సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్ ఆకు చాటు పిందె తడిసే పాటను రీమిక్స్ చేసుకున్నాడు కదా. కథ ఆ సినిమాది కాకపోయినా ఆ పాటలో గెటప్ స్టెప్స్ అన్ని అచ్చుగుద్దినట్టు దించాడుగా. అది మరీ పాతది అనుకుందాం. శీను వైట్ల తీసిన బాద్షా సినిమాలో జస్టిస్ చౌదరి గెటప్ లో జూనియర్ చేసిన అల్లరి చిన్నది కాదే. మరి తాతయ్య జోలికే వెళ్ళలేను అన్న తారక్ గతంలో చేసినవి మిస్ అయ్యాడేమో.
Tags:    

Similar News