మా రెండు ఫ్యామిలీల మధ్య 30-35 ఏళ్లుగా పోటీ ఉంది: ఎన్టీఆర్

Update: 2021-12-26 05:20 GMT
టాలీవుడ్ రెండు పెద్ద సినీ ఫ్యామిలీలైన నందమూరి - మెగా ఫ్యామిలీ హీరోల మధ్య ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ పోరు ఉందనే సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ ఢీకొనే ఈ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తారని సినీ అభిమానులు ఊహించలేదు. దర్శకధీరుడు రాజమౌళి అసాధ్యం అనుకున్న కలయికను సుసాధ్యం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చి ''ఆర్.ఆర్.ఆర్'' అనే పాన్ ఇండియా సినిమాని రూపొందించారు.

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ - కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా RRR. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 2022 జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో దూసుకుపోతున్న జక్కన్న అండ్ టీమ్.. నేషనల్ వైడ్ ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా FC ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ రాజమౌళితో పాటుగా తారక్‌ - చరణ్‌ పాల్గొని పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా నందమూరి - మెగా కుటుంబాల మధ్య ఉన్న బాక్సాఫీస్ పోరు గురించి ఎన్టీఆర్ ప్రస్తావించారు. 'RRR తర్వాత బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్స్ వస్తాయని భావిస్తున్నారా?' అనే ప్రశ్నకు సమాధానంగా.. ''ఇద్దరం రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన నటులం. ఇది ఇప్పుడు చెప్పొచ్చొ లేదో.. రెండు ఫ్యామిలీల మధ్య 30-35 ఏళ్లుగా పోరు కొనసాగుతోంది. కానీ మేమిద్దరం మంచి స్నేహితులం కూడా. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌ గానే ఉంటుంది'' అని తారక్ అన్నారు.

''అప్పట్లో హిందీలో ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి 'కరణ్ అర్జున్' సినిమా చేశారు. ఇప్పుడు చాలామంది కలిసి నటించడానికి ముందుకు వస్తున్నారు. మనదేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన యాక్టర్స్ ఉన్నారు. RRR తర్వాత వారందరూ ఒకే తాటి మీదకు వస్తారని.. బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తాయని భావిస్తున్నాను. నా దృష్టిలో దీనికి భాష అనేది అడ్డంకి కానే కాదు. మనల్ని గైడ్ చేయడానికి.. యాక్టర్స్ అందర్నీ ఒక తాటి మీదకు తీసుకొచ్చే ఐడియాతో వస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఆల్రెడీ మల్టీస్టారర్స్ స్టార్ట్ అయ్యాయి.. రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్దవి వస్తాయని అనుకుంటున్నా'' జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయ పడ్డారు.

దర్శకుడు రాజమౌళి RRR సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఇది దేశభక్తి చిత్రం కాదు. కేవలం స్నేహానికి సంబంధించిన సినిమా. దేశం, జాతి మీద గౌరవం ఉంది. 'జనగణమన' ఎప్పుడు విన్నా నాకు కన్నీళ్లు ఆగవు.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలా అని వేరే దేశం వాళ్లని ఇష్టపడనని కాదు. దేశభక్తి ఉంది.. అదే విధంగా ఇతరుల్ని గౌరవించే సంస్కారం కూడా ఉంది'' అని తెలిపారు.

ఒక సినిమాని తెరకెక్కించే సమయంలో అన్నిటి కంటే ముఖ్యంగా ఎమోషన్ ని పరిగణలోకి తీసుకుంటాని రాజమౌళి అన్నారు. భావోద్వేగం ఉంటే ఏ సీన్‌ అయినా కచ్చితంగా పండుతుందని తాను నమ్ముతానని.. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' లో కూడా ప్రతి ఫ్రేమ్‌ లో ఒక ఎమోషనల్‌ కనెక్ట్‌ ఉంటుందని చెప్పారు. 'నాటు నాటు' కేవలం డ్యాన్స్‌ నంబర్‌ మాత్రమే కాదని.. అందులోనూ ఒక ఎమోషన్‌ ఉంటుందని.. అది సినిమా చూశాక అందరికి అర్థం అవుతుందని రాజమౌళి తెలిపారు.

సన్నివేశానికి ఎమోషన్‌ ని కూడా జోడించి చూపించినప్పుడే ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారని తాను అనుకుంటానని.. సినిమాలో సీన్స్‌ చూసి ప్రేక్షకులు వావ్‌ అనుకోవాలని జక్కన్న చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''RRR మూవీలో ఓ కీలకమైన ఫైట్‌ సీక్వెన్స్ కోసం జక్కన్న 65 సార్లు షూట్‌ చేశారు. ఆయన ప్రతి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అప్పుడప్పుడూ మా ఐడియాస్ కూడా తీసుకుంటారు'' అని వెల్లడించారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''రాజమౌళి కాబట్టి RRR కథ వినకుండానే ఓకే చెప్పాను. సుకుమార్‌ తో చేసిన 'రంగస్థలం' కూడా కథ వినకుండానే చేసాను'' అని అన్నారు. అలానే రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ''సెట్‌ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ 24 క్రాఫ్ట్స్ లో ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది'' అని చెర్రీ చెప్పారు. దీనికి జక్కన్న స్పందిస్తూ.. 'ప్రతి సీన్ కు నాలో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరిగ్గా చేయకపోతే నా ఆలోచనకు తగ్గట్టుగా సన్నివేశం రాదేమోనని భయపడుతుంటాను'' అని వివరణ ఇచ్చారు.

ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. 'నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు. నా సినిమాలో ఎవరైనా నటిస్తారు' అనే భావన నాలో వస్తే అదే నా పతనానికి నాంది అని నేను భావిస్తాను. నేను అలాంటి వాతావరణంలో పెరగలేదు. అలాంటి ఆలోచన నాలో లేదు. నా కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి రెండు పవర్‌ ఫుల్‌ రోల్స్ తో సినిమా చేయాలనే ఐడియా ఉంది. మనకి దుర్యోధనుడు-కర్ణుడు.. కృష్ణుడు-అర్జునుడు స్నేహితులని తెలుసు. కానీ, కృష్ణుడు-దుర్యోధనుడు స్నేహితులైతే ఎలా ఉంటుందనేది నా ఆలోచన. అదే మాదిరిగా అల్లూరి - కొమురం భీమ్‌ ఐడియా వచ్చినప్పుడు నాకు ఇద్దరు బిగ్ స్టార్స్ కావాలి. చరణ్‌-తారక్‌ అయితే ఆ పాత్రలకు న్యాయం చేయగలరని నేను నమ్మాను. మా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కథలో ఉన్న ఎగ్జైట్మెంట్ సినిమా అంతా ఉండాలి. అదే సుమారు మూడేళ్లపాటు ఈ జర్నీ ఇలా సాగేలా చేసింది'' అని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ''మా ఇద్దరి కంటే మా గురించి రాజమౌళికే ఎక్కువ తెలుసు. అందుకే మమ్మల్ని ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో భాగం చేశారు. మొదటిసారి నాకు నేను ఎంతో విభిన్నంగా, పవర్‌ ఫుల్‌ గా కనిపించాను. యాక్టర్ గా నాలోని మరో కోణం నాకు కూడా తెలిసి వచ్చింది. ప్రతిసారీ షాట్‌ కంప్లీట్ అయ్యాక జక్కన్న నోటి నుంచి ఒక్క 'ఎస్‌' వస్తే అది చాలు మేము ఆనందపడే వాళ్లం'' అని చెప్పారు.

దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ ''రాజమౌళి నాకు స్నేహితుడు మాత్రమే కాదు.. జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి. కెరీర్‌ లో ఏం జరుగుతుందో కూడా తెలియని టైంలో.. నార్మల్ గా ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా సాగుతున్న నా లైఫ్ ని ఇంతలా మార్చింది ఆయనే. జక్కన్న వల్లే నేను మంచి యాక్టర్ గా మారగలిగాను. RRR లో నేను పోషించిన పాత్ర ఎంతో క్లిష్టమైనది. భీమ్ చాలా ఇన్నోసెంట్. తను చాలా స్ట్రాంగ్ అని.. తనకు బ్రూటల్ స్ట్రేంత్ ఉందని తెలుసు.. కానీ మైండ్ లో చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు. రాజమౌళి వల్లే అలాంటి పాత్ర చేయడం సాధ్యమైంది'' అని తెలిపారు.
Tags:    

Similar News