ఫోటో టాక్: జపాన్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ మాటామంతీ..!

Update: 2022-10-04 17:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నూనూగు మీసాల వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ అభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్‌ లో ఆయన్ని అభిమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ తరువాత జపాన్ లో అంత క్రేజ్ ఉన్న ఇండియన్ హీరో తారక్ అనే చెప్పాలి.

'జనతా గ్యారేజ్‌' టైంలో ఓ జపాన్ అభిమాని అక్కడి నుంచి మన దేశానికి వచ్చి ఎన్టీఆర్ తో ఫొటో తీసుకొని వెళ్లడంటేనే ఆయనకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తారక్ యాక్టింగ్ తో పాటుగా డ్యాన్స్ లను జపనీస్ విపరీతంగా లైక్ చేస్తుంటారు.

ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు జపాన్ లోనూ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ‘బాద్ షా’ చిత్రం రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటున్న ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. అక్టోబర్ 21న జపాన్‌ లో విడుదల కానుంది.

'బాహుబలి' ప్రాంఛైజీతో సత్తా చాటిన జక్కన్న.. ఈసారి RRR మూవీతో జపనీస్ ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ జపాన్ మీడియాతో ఆన్ లైన్ వేదికగా ముచ్చటించారు. ట్రిపుల్ ఆర్ చిత్రానికి సంబంధించిన విశేషాలను వారితో పంచుకున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన తారక్.. ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "జపనీస్ మీడియాతో RRR అనుభవాన్ని తిరిగి పొందుతున్నాను. అందరి ప్రేమ మరియు ప్రశంసలకు ధన్యవాదాలు" అని తారక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

RRR సినిమా జపాన్‌ లోని థియేటర్లలో అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఇది అంతర్జాతీయ మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించింది. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు నామినేషన్స్ వెళ్లడానికి ఇంకా మార్గాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, RRR చిత్రంలో కొమరం భీమ్‌ గా జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటించారు. ఇందులో అలియా భట్ - ఒలివియా మోరీస్ - అజయ్ దేవగన్ - రే స్టీవెన్సన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News