ట్రైలర్ టాక్: ఓం నమో వేంకటేశాయా!!

Update: 2017-01-08 18:00 GMT
ఓం నమో వేంకటేశాయో.. అక్కినేని నాగార్జున మరియు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలసి అందిస్తున్న మరో సుందర దృశ్య కావ్యం.. ఆధ్యాత్మిక చిత్రం.. నవరస మనోహరమైన సినిమా. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ఆడియోను లాంచ్ చేయడంతో పాటు ధియేట్రికలర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

ఎప్పటిలాగానే దేవుడ్ని(ఇక్కడ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని) విపరీతంగా ప్రేమించే ఒక భక్తుడు. ఆ భక్తుడ్ని ఇక్కట్లు పాలు చేయాలనుకునే కొందరు విలన్లు. వారు అతన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు దేవుడు కూడా అతనికి పరీక్ష పెట్టడం. చివరికి అతనితో దేవుడు కలసిపోవడం. లోక సంరక్షణ దుష్ట సంహారం జరిగిపోవడం.. ఇదే కథ. ఈసారి హాథీ రామ్ బాబా కథను సెంట్రల్ ఎలిమెంట్ గా తీసుకుని.. వేంకటేశ్వరుడి లీలను అల్లుతున్నారు దర్శకేంద్రుడు. యథావిథిగా నాగార్జున తన పాత్రలో బాగా లీలమైపోగా.. నార్త్ నటుడు సౌరభ్ వేంకటేశ్వరునిగా మెప్పించాడు. అలాగే భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కూడా ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రల్లో రావు రమేష్‌.. సంపత్.. విమలా రామన్.. అస్మిత.. ఏదో ఒక ఫ్రేములో తళుక్కున మెరిసిన ప్రగ్యా జైస్వాల్ కూడా బాగానే ఉన్నారు. కాని జగపతిబాబును ఈ ట్రైలర్లో పరిచయం చేయలేదు.

ఎప్పటిలాగానే కీరవాణి మ్యూజిక్ కూడా మనోహరంగానే ఉంది. అయితే ఈసారి కంప్యూటర్ల ద్వారా క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం బాగా ఆకట్టేసుకుంది. వాటికితోడు దర్శకేంద్రుడి దర్శకత్వ ప్రతిభ అణువణువులోనూ కనిపిస్తూనే ఉంది. అందుకే తెలుగు ప్రేక్షకులను ఈ భక్తిరస చిత్రంతో నాగ్ మరోసారి ఆధ్యాత్మిక చింతనవైపుగా నడిపిస్తాడని అనిపిస్తోంది.


Full View
Tags:    

Similar News