రెండు సినిమాలకు కలిపి ఒకటే ప్లాన్‌ చేశారట

Update: 2018-12-14 05:03 GMT
‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ ను మొదట సింగిల్‌ పార్ట్‌ గానే ప్లాన్‌ చేసిన విషయం తెల్సిందే. తాము చెప్పాలనుకున్న విషయాలన్ని సినిమాలో చూపిస్తే లెంగ్త్‌ ఎంత తగ్గించినా కూడా నాలుగు గంటలకు తక్కువ అయ్యే పరిస్థితి లేదట. మొదట ఆ నాలుగు గంటల సినిమాను విడుదల చేయాలని భావించారట. కాని నాలుగు గంటల సినిమా అంటే అతి పెద్ద సాహసం అవుతుందని భావించి రెండు పార్ట్‌ లుగా విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెండు పార్ట్‌ లుగా విడుదల అవుతున్నా కూడా రెండు సినిమాలు అనే భావన లేకుండా మొత్తం ఒకటే అన్నట్లుగా పబ్లిసిటీ చేయాలని ఎన్టీఆర్‌ టీం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సహజంగా ఏదైనా సినిమా రెండు పార్ట్‌ లుగా వస్తే దేనికి అదే ఆడియో వేడుక ఉంటుంది, రెండు టీజర్‌ లు, రెండు ట్రైలర్‌ లు ఇలా అన్ని కూడా రెండు రెండు ఉంటాయి. కాని ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి మాత్రం అలా ఉండబోవడం లేదని తెలుస్తోంది. రెండు పార్ట్‌ లలో కలిపి మొత్తం 11 పాటలు ఉండబోతున్నాయి. ఆ పదకొండు పాటలను కూడా ఈ నెలలో జరుగబోతున్న ఆడియో విడుదల కార్యక్రమంలో విడుదల చేయబోతున్నారట.

ఇక రెండు పార్ట్‌ లకు కలిపి కూడా ఒక ట్రైలర్‌ ను కట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ట్రైలర్‌ తోనే రెండు పార్ట్‌ ల ప్రమోషన్‌ నిర్వహించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌’ మొదటి పార్ట్‌ విడుదలకు ముందు ఆడియో వేడుక, ప్రీ రిలీజ్‌ మీట్‌ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాని ఎన్టీఆర్‌ రెండవ పార్ట్‌ కు మాత్రం పెద్దగా హడావుడి ఉండదు అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వేడుకలు ఏమీ నిర్వహించకుండానే రెండవ పార్ట్‌ ను నేరుగా విడుదల చేస్తారట. అంటే రెండు పార్ట్‌ లకు కలిపి ఆడియో వేడుక, ట్రైలర్‌, ప్రమోషన్‌ కార్యక్రమాలు ఒక్కటే సారి నిర్వహించబోతున్నారు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News