OTT వార్: విరాటప‌ర్వం (Vs) సామ్రాట్ పృథ్వీరాజ్

Update: 2022-06-29 15:24 GMT
OTTలో రెండు ట్రెండీ సినిమాల న‌డుమ‌ వార్ కి డేట్ ఫిక్స‌య్యింది. విరాటప‌ర్వం వ‌ర్సెస్ సామ్రాట్ పృథ్వీరాజ్! ర‌స‌వ‌త్త‌ర‌ పోరుకు జూలై 1న రంగం సిద్ధమైంది. యాథృచ్ఛికంగా ఈ రెండు సినిమాల ఓటీటీ పోరుకు ఒకే తేదీ ఫిక్స‌య్యింది. అయితే ఈ రెండు సినిమాలు జాన‌ర్ ప‌రంగా దేనిక‌దే యూనిక్. విరాట‌ప‌ర్వం సోష‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌గా.. సామ్రాట్ పృథ్వీరాజ్ వీరుని క‌థ‌తో వార్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది.

రానా ద‌గ్గుబాటి- సాయి పల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'విరాట పర్వం' జూలై 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ బుధవారం నాడు ఆ మేర‌కు స్ట్రీమింగ్ డేట్ ని ట్వీట్ చేసింది. ప్రేమ.. స్వేచ్ఛ కోసం అంతులేని తపనల క‌థ విరాఠ‌ప‌ర్వం. తెలుగు- మలయాళం- తమిళంలో జూలై 1న నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేందుకు సిద్ధం కండి! అంటూ స‌ద‌రు ఓటీటీ కంపెనీ టీజ్ చేసింది. విరాట‌ప‌ర్వం ఈ ఏడాది జూన్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 15 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.

తెలంగాణ ప్రాంతంలో 1990లలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన చిత్ర‌మిది. రానా కలం పేరు 'అరణ్య'. అత‌డు కామ్రేడ్ రావన్న పాత్రను ర‌చిస్తాడు. ఆ పాత్ర‌లో అత‌డు క‌నిపిస్తాడు. కామ్రేడ్ రవన్న రచనలను ఆరాధించే వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. ఆ ఇరువురి న‌డుమ ప్రేమ‌క‌థ ఉద్య‌మం వ‌గైరా అంశాలు ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించ‌గా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ప‌తాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. డాని శాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ లు కాగా .. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- జరీనా వహాబ్- ఈశ్వరీ రావు- సాయి చంద్ ముఖ్యమైన పాత్రలలో న‌టించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వ‌ర్క్ అందించ‌గా.. స్టీఫెన్ రిచర్డ్ - పీటర్ హెయిన్ స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసారు.

మ‌రోవైపు విరాట‌ప‌ర్వంతో పాటు ఓటీటీలో పోటీప‌డేందుకు భారీ సినిమా సిద్ధంగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల లోపు అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసార‌మ‌వుతోంది. జూన్ 3న ఈ హిందీ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు జూలై 1 నుండి ఓటీటీలో ప్రసారమ‌వుతుంది.

హిందూ రాజవంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ గా అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో న‌టించ‌గా థియేట్రిక‌ల్ గా ఫ్లాపైన సంగ‌తి తెలిసిన‌దే. చంద్ర‌ప్ర‌కాష్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించింది. మాజీ మిస్ వ‌రల్డ్ మానుషి చిల్ల‌ర్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. ఈ భారీ హిస్టారిక‌ల్ మూవీ ఓటీటీలో ఏ మేర‌కు ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుందో చూడాలి. విరాట‌ప‌ర్వం- సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రాల్లో ఓటీటీలో పై చేయి సాధించేది ఏది అన్న‌ది హాట్ టాపిక్ గా మారుతోంది.
Tags:    

Similar News