టీజర్ తో పక్కాగా అంచనాలు పెంచే పనిలో మారుతి!

Update: 2021-11-06 10:30 GMT
ఏ సినిమా అయినా ఎలా ఉంటుందనేది థియేటర్ కి వస్తేనే తెలుస్తుంది. హీరో ఎలా చేశాడు .. హీరోయిన్ అందాలను ఎలా ఆరబోసింది .. కామెడీ ఎలా ఉంది? ఇలాంటివన్నీ థియేటర్లలోకి అడుగుపెట్టిన తరువాతనే తెలుస్తాయి. థియేటర్ వరకూ రప్పించడంలో టైటిల్ ప్రధానమైన పాత్రను పోషిస్తుందనేది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే సరైన టైటిల్ పెట్టకపోవడం వలన .. కామన్ ఆడియన్స్ కి అర్థంకాని విధంగా టైటిల్స్ డిజైన్ చేయించడం వలన దెబ్బతిన్న సినిమాలు చాలానే కనిపిస్తాయి.

అందువల్లనే దర్శకుడు మారుతి తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. సాధ్యమైనంతవరకూ క్యాచీ టైటిల్స్ పెడతాడు. తన మొదటి సినిమా నుంచి ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాడు. 'ఈ రోజుల్లో' .. 'బస్టాప్' .. 'కొత్త జంట' .. భలే భలే మగాడివోయ్' .. 'బాబు బంగారం' .. 'మహానుభావుడు' .. ఇలా వాడుకలో ఉన్న మాటలనే ఆయన తన సినిమాలకి టైటిల్స్ గా పెట్టేసి జనానికి మరింత దగ్గరగా తీసుకుని వెళుతుంటాడు. ఇక 'మంచిరోజులు వచ్చాయి' కూడా ఆ దార్లో నడిచివచ్చిందే.

ఇక ఈ సినిమా తరువాత మారుతి నుంచి 'పక్కా కమర్షియల్' రానుంది. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను, యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2వారు నిర్మించారు. సాధారణంగా ఏ పనిచేయాలన్నా అందులో ఎంతో కొంత లాభం ఉంటేనే తప్ప అడుగుముందుకు వేయనివాళ్లను ఉద్దేశించి 'వాడు పక్కా కమర్షియల్ రా' అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ లైన్ పైనే ఈ సినిమా నడుస్తుందేమో చూడాలి. ఈ సినిమా నుంచి ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కి డైలాగ్స్ హైలైట్ గా నిలనున్నాయనీ .. ఇది ఇంతవరకూ మారుతి చేయని జోనర్ అని అంటున్నారు. టీజర్ తోనే అంచనాలు పెంచేయాలనే ఆలోచనతో మారుతి కాస్త గట్టిగానే కసరత్తు చేశాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇంతవరకూ గోపీచంద్ చేస్తూ వచ్చిన సినిమాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో రావు రమేశ్ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి


Tags:    

Similar News