రెండు దశాబ్దాల యూట్యూబ్..దాని సక్సెస్ స్టోరీ చదివేద్దాం!

ఎన్నో సక్సెస్ స్టోరీలను అందిస్తున్న యూట్యూబ్..సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..;

Update: 2025-03-02 09:30 GMT

‘‘డాడీ పైథాగరస్ సిద్ధాంతం అర్థం కావడం లేదు..కాస్త చెప్పవూ..’’ నాకేం తెలుసురా యూట్యూబ్ లో చూసేయ్యరాదు అంటూ డాడీ రిప్లే.. ‘‘మమ్మి..చేపల ఇగురు ఎలా చేయాలే..’’ కొత్తగా పెళ్లైన కూతురు అమ్మతో మొరపెట్టుకుంటే..‘‘దానికంత కష్టమెందుకే యూట్యూబ్ లో వీడియో చూసి చేసేయ్’’ అని అమ్మ అలవోకగా ఓ సలహా. ‘‘బస్సులో ఐదు గంటల ప్రయాణం చాలా బోర్ కొడుతుందిరా..’’ అంటే ఏముంది యూట్యూబ్ లో ఓ సిన్మా చూసేయ్ రా..ఊరొచ్చేస్తుంది.. ఓ ఫ్రెండ్ సూచన..ఇలా సమస్య ఏదైనా ఒకటే పరిష్కారం. అడిగితే గానీ అమ్మైనా అన్నం పెట్టదు. కాని యూట్యూబ్ మాత్రం టైపు చేస్తే చాలు నీకు కావాల్సింది వెంటనే వీడియో రూపంలో అందిస్తుంది. చిన్నా,పెద్దా తేడా లేకుండా తమ రోజువారీ జీవితంలో కనీసం ఓ గంటైనా యూట్యూబ్ తో మింగిల్ కావాల్సిందే. ఎంటర్ టైన్ మెంట్ కు వన్ స్టాప్ సెంటర్ గా మారిపోయింది యూట్యాబ్. ఇలా ఇరవై ఏండ్లుగా యూట్యూబ్ వీక్షకులను అలరిస్తూనే ఉంది. ఎన్నో సక్సెస్ స్టోరీలను అందిస్తున్న యూట్యూబ్..సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ అనుకుంటాం కానీ మొదట్లో ఇది ఓ డేటింగ్ యాప్. స్టీవ్ చెన్, చాద్ హాలీ, జావేద్ కరీమ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఓ రోజు పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ పార్టీకి జావేద్ అనుకోకుండా రాలేకపోయాడు. ఆ పార్టీలో తాము చేసిన ఎంజాయ్ మెంట్ ను నోటితో చెప్పేదాని కన్నా వీడియో చూపించి చెబుదామని మిగతా ఫ్రెండ్స్ బాగుంటుదనుకున్నారు. అయితే ఆ వీడియోను షేర్ చేయడానికి ఆన్ లైన్ లో అప్పటికీ అనువైన వేదిక లేదు. అందుకే వారు ఆలోచనలో పడ్డారు. ఈ ఆలోచనల్లోంచి పుట్టింది ఓ బిజినెస్ ఐడియా. ‘ఓ సైట్ పెడుదాం. అందులో వీడియోల ద్వారా అమ్మాయిలూ, అబ్బాయిలూ వాళ్లని వాళ్లు పరిచయం చేసుకుంటారు. ఈ పద్ధతిలో లైఫ్ పార్టనర్ ను ఎంచుకుంటారు. ఇందులో మనం చేసేదేం ఉండదు. ఎవరి కథవాళ్లదే. కాబట్టి ‘యూ ట్యూబ్ ’ అని పేరు పెడదాం..’’ అని అనుకున్నారు ఆ ముగ్గురు ఫ్రెండ్స్.

2005 ఫిబ్రవరి 14న..అంటే ప్రేమికుల రోజున యూట్యూబ్ ప్రారంభించారు స్టీవ్, చాద్, జావేద్. తాము ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బంతా అందులో పెట్టారు. కొన్ని లోన్లు తీసుకున్నారు. అయినా ఆ వేదిక సక్సెస్ కాలేదు. యూట్యూబ్ లో ప్రేమను పంచుకోవడానికి సిగ్గుపడ్డారు ప్రేమికులు. దీంతో ఆలోచనను మరింత విస్తరించారు ఆ ముగ్గురు ఫ్రెండ్స్. ప్రేమికులే కాదు ఎవరైనా సరే తమ వీడియోలను యూట్యూబ్ లో పంచుకునేలా మార్చారు. జావేద్ కరీమ్ ‘‘మీ ఎట్ ది జూ’’ అనే పేరుతో జూలో తీసిన వీడియోను మొదటగా షేర్ చేశాడు. ఇలా మొదలైంది యూట్యూబ్. అయితే అప్పటికే యూట్యూబ్ పేరుతో ఓ సంస్థ ఉంది. యూట్యూబ్ కోసం వెతికే నెటిజన్లు కాస్త అయోమయ పడ్డారు. దీంతో యూట్యూబ్ పేరుతో ఉన్న మొదటి సంస్థ ఇబ్బంది పడి కోర్టుకు ఎక్కింది. చివరకు ఆ సంస్థే రాజీపడి ఆ పేరును ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కు ఇచ్చేసింది.

ఇక అప్పట్నుంచి యూట్యూబ్ అత్యంత ప్రజాదరణ పొందుతూ వటుడింతై.. అన్నట్టుగా ఎదిగిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అన్ని చూడాలంటే 18 వేల సంవత్సరాలు పడుతుందట. యూట్యూబ్ కు ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుందని మనకు తెలుసు. గతేడాది యూట్యూబ్ కు ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా మూడు లక్షల కోట్లు. యూట్యూబ్ ను ఎక్కువగా చూసేవారిలో భారతీయులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న యూట్యూబ్ ను ఉత్తర కొరియా, చైనా, తుర్కియే, మొరాకో లాంటి దేశాలు బ్యాన్ చేశాయి.

యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ఇన్ ఫ్లూయెన్సర్లు ఆదాయం పొందుతున్నారు. ఇందులో మొదటి స్థానం మాత్రం మిస్టర్ బీస్ట్ దే. ఇతడు తన వీడియోల ద్వారా సంపాదించిన ఆస్తి రూ.7,500 కోట్లు. అంటే పెద్ద పారిశ్రామికవేత్త కూడా మిస్టర్ బీస్ట్ అంత సంపాదించలేడు. ఇండియాలో అత్యధికంగా ఆదాయం పొందుతున్న వారిలో గౌరవ్ ఛౌదురి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు ఇప్పటివరకు రూ.350 కోట్లు సంపాదించాడు. యూట్యూబ్ సక్సెస్ స్టోరీని చూస్తే ఇంకా ఎన్నో అబ్బురపడే అంశాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తూ, వారికి కావాల్సిన సమాచారాన్ని, ఆనందాన్ని అందిస్తున్న యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఓ పెద్ద వెబ్ సీరిస్ తీసేయవచ్చు.

Tags:    

Similar News