నేను ఆ మాట చెప్పగానే మెగాస్టార్ ఒప్పుకున్నారు: పరుచూరి

Update: 2021-08-06 03:45 GMT
తెలుగులో ఎన్నో సినిమాలకు రచయితగా సత్యానంద్ గారు పనిచేశారు. ఆయన కథ ... మాటలు అందించిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. ఆయనతో తనకి గల అనుబంధం గురించి, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "నేను ఇండస్ట్రీకి రాకముందే సత్యానంద్ గారు రాసిన 'మాయదారి మల్లిగాడు' .. 'కిరాయి కోటిగాడు' సినిమాలు చూశాను. ఒకసారి 'జ్యోతి' సినిమా షూటింగు జరుగుతూ ఉండగా నేను అక్కడికి వెళ్లాను. ఆ సినిమాకి సత్యానంద్ గారు పనిచేశారు. కానీ ఆ సమయంలో ఆయన అక్కడ లేరు.

ఆ తరువాత కొంతకాలానికి నేను రైటర్ గా ఇండస్ట్రీకి వచ్చాను. అందరం మద్రాసులోనే ఉన్నప్పటికీ ఫంక్షన్స్ కి మాత్రమే కలుస్తూ ఉండేవాళ్లం. అలా ఆయనను కలుస్తూ ఉండటం వలన నాకు ఒక విషయం అర్థమైంది. ఆయన చాలా సౌమ్యుడు .. మితభాషి. ఆత్ర్రేయలా ఆయన చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ఆయన రాసిన సినిమాలకి సంబంధించిన  వివరాలు లభించడం లేదు. తప్పకుండా ఆయన మాతో సమానంగానో .. మా కంటే ఎక్కువగానో సినిమాలు రాసేసి ఉంటారు. మా అన్నయ్య తరువాత మళ్లీ నన్ను అంతటి ఆప్యాయంగా పిలిచేది సత్యానంద్ గారే.

ఆయనతో కలిసి నేను పనిచేసిన మొదటి సినిమా 'కొదమసింహం'. ఆ సినిమాకి నేను స్క్రీన్ ప్లే రాస్తే, కథా - మాటలు సత్యానంద్ గారు రాశారు. 'కొదమసింహం' సినిమా సిటింగ్స్ జరుగుతూ ఉండగా చిరంజీవి గారు కాల్ చేశారు. కథ బాగుంది .. కానీ ఎక్కడో తేడా కొడుతుంది అన్నారు. ఒకసారి రమ్మంటే అక్కడికి వెళ్లాను. అక్కడ సత్యానంద్ గారు ఉన్నారు. మోహన్ బాబు గారు పోషించిన 'సుడిగాలి' పాత్ర చనిపోవడంతో విశ్రాంతి పడుతుంది అని చెప్పారు. మోహన్ బాబు పాత్ర చనిపోకూడదు .. ఆయన ద్వారా హీరో తన తల్లిదండ్రుల రహస్యాలను తెలుసుకోవాలంటే, ఆ పాత్ర బ్రతికి ఉండాలి అన్నాను నేను.

వెంటనే నా అభిప్రాయంతో చిరంజీవిగారు ఏకీభవించారు. ఇక ఆ సినిమా స్క్రీన్ ప్లే బాధ్యతను నాకు అప్పగించారు. 'సుడిగాలి' పాత్ర బ్రతికుండాలన్న తరువాత కథ మారిపోతుంది గనుక, అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టాలి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. విశ్రాంతి సమయంలో నేను బ్రతికించిన 'సుడిగాలి' పాత్ర చివర్లో కూడా చావలేదు. సుడిగాలి పాత్ర అక్కడ బ్రతికింది గనుక .. ఆ కథ బ్రతికింది అనే విషయాన్ని చిరంజీవి విశ్వసించారు. ఒక 'కొండవీటి సింహం' .. 'ఒక జస్టిస్ చౌదరి' రాసిన సత్యానంద్ గారితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం" అని చెప్పుకొచ్చారు.             
Tags:    

Similar News