అదే రోల్ తో మెగా హీరోల ఎంట్రీ

Update: 2016-03-25 07:30 GMT
సౌత్ హీరోలకు బాలీవుడ్ డ్రీమ్స్ బాగానే ఉంటాయి. కానీ ఇందులో సక్సెస్ రేషియో తక్కువగానే ఉంటుంది. టాలీవుడ్ వరకు చూసుకుంటే మెగా హీరోలకు బాలీవుడ్ అంటే మోజు, క్రేజు ఎక్కువే. ఇప్పుడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీ రిలీజ్ చేస్తున్నాడు కానీ.. హిందీ సినీ రంగంలో సత్తా చాటేందుకు మెగాస్టార్ చిరంజీవి పాతికేళ్లకు పూర్వమే గట్టి ప్రయత్నాలే చేశారు.

బాలీవుడ్ చిరు మొదటి సినిమా ప్రతిబంధ్. ఇది తెలుగులో రాజశేఖర్ చేసిన 'అంకుశం' చిత్రానికి రీమేక్. ఇందులో హీరోది పోలీస్ రోల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ ఈ 'ప్రతిబంధ్' హిట్ అయినా.. తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో మెగాస్టార్ బాలీవుడ్ ప్రయత్నాలు మానుకున్నారు. ఇక జంజీర్ అంటూ మూడేళ్ల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా గట్టి ప్రయత్నమే చేశాడు. ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకుని.. అమితాబ్ బచ్చన్ జంజీర్ ను రీమేక్ చేశాడు చెర్రీ. ఇందులో కూడా హీరో పోలీస్ పాత్రే. అయితే ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన షాక్ కి మళ్లీ బాలీవుడ్ మాట ఎత్తడం లేదులెండి.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ కూడా బాలీవుడ్ లో పోలీస్ పాత్రతోనే అడుగు పెడుతున్నాడు. గబ్బర్ సింగ్ మొదటి భాగం 'దబాంగ్' కి రీమేక్ అయినా.. ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం పూర్తిగా ఒరిజినల్ మూవీ. హీరో కేరక్టరైజేషన్ మాత్రం తీసుకుని.. మిగతాదంతా పవన్ స్వయంగా రాసుకున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఏమైనా.. మెగా హీరోలందరూ బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి పోలీస్ పాత్రలనే ఎంచుకోవడం విశేషమే.
Tags:    

Similar News