పవన్ నాగబాబును ఆదుకున్నది వాస్తవమే

Update: 2016-04-14 07:30 GMT
మెగా బ్రదర్ నాగబాబు తన ‘అంజనా ప్రొడక్షన్స్’ సంస్థను మూసేసి సినీ నిర్మాణానికి పూర్తిగా దూరమయ్యేలా చేసిన చిత్రం ‘ఆరెంజ్’. ఆ సినిమా నాగబాబును అలాంటిలాంటి దెబ్బ కొట్టలేదని చెబుతారు మెగా ఫ్యామిలీ సన్నిహితులు. ఈ సినిమా వల్ల నాగబాబు దారుణంగా నష్టపోయాడని.. ఎటూ పాలుపోలేని స్థితిలో ఉంటే తమ్ముడు పవన్ కళ్యాణే అతణ్ని ఆదుకున్నాడని అంటారు. ఐతే దీని గురించి నాగబాబు కానీ.. పవన్ కానీ.. ఎప్పుడూ బయటపడింది లేదు. పవన్ మీడియాతో మాట్లాడ్డమే ఉండదు కాబట్టి అతను దీని గురించి వెల్లడించే అవకాశం లేదు. ఇక నాగబాబు దీని గురించి మాట్లాడితే.. అంత ఇబ్బందుల్లో ఉంటే చిరు ఏం చేశాడన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే ‘ఆరెంజ్’ విషయంలో తెరవెనుక ఏం జరిగిందన్నదానిపై అఫీషియల్ సమాచారం ఏదీ లేదు.

ఐతే ఎప్పుడూ మీడియాతో మాట్లాడని పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా మీడియాకు తెగ ఇంటర్వ్యూలిచ్చేస్తున్నాడు కదా. అనుకోకుండా ‘ఆరెంజ్’ ప్రస్తావన కూడా వచ్చింది. ఆ సినిమా పేరెత్తకుండా ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పకనే చెప్పేశాడు పవన్. ‘గబ్బర్ సింగ్’ తాను డబ్బులు అవసరం పడే చేశానని చెబుతూ.. అప్పుడేం జరిగిందో వెల్లడించాడు పవన్. తన అన్నయ్య ఓ సినిమాకు సంబంధించి ఫైనాన్షియల్ క్రైసిస్ లో పడ్డాడని.. ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించాల్సి రావడంతో తాను అత్యవసరంగా ఓ సినిమా ఏదైనా చేసి డబ్బులు సమకూర్చాల్సి వచ్చిందని.. ఆ సమయంలోనే అంతకుముందు చూసి వద్దనుకున్న ‘దబాంగ్’ను మరోసారి చూసి రీమేక్ చేయడానికి ఓకే చెప్పానని.. తన సొంత బేనర్ మీద సినిమా తీయాలని భావించింది కూడా అందుకేనని పవన్ వెల్లడించాడు. మొత్తానికి డీటైల్డ్ గా మేటర్ చెప్పకపోయినా.. ‘ఆరెంజ్’ విషయంలో తన అన్నయ్యకు తాను సాయం చేసిన మాట వాస్తవమే అని అంగీకరించాడు పవన్.
Tags:    

Similar News