అజ్ఞాతవాసి ఆడియోలో పవన్ సెన్సేషనల్ స్పీచ్

Update: 2017-12-19 18:38 GMT
అజ్ఞాతవాసి ఆడియోఫంక్షన్ లో పవన్ స్పీచ్ హైలైట్ అవడంలో ఆశ్చర్యం లేదు. సినిమాను.. పాలిటిక్స్ ను దేశాన్ని కలిపి పవర్ స్టార్ మాట్లాడిన మాటలు అందరినీ అలరించాయి. "ఇంత ప్రేమను.. ఇంత అభిమానాన్ని.. సినిమా ద్వారా ఇచ్చిన మన దేశానికి వందనాలు తెలుపుకుదాం. భారత్ మాతా కీ జై.భారత్ మాతా కీ జై.భారత్ మాతా కీ జై. ఇక్కడికి వచ్చిన అందరితో పాటు.. రాలేకపోయిన వారికి.. బైట ఉండిపోయిన మన అభిమానులు అందరికీ.. స్థలం చిన్నది కావడం వల్ల బైట ఉండిపోయిన బైట చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరికీ ముందస్తుగా నా క్షమాపణలు. నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే.. అభిమానించే ప్రతీ ఒక్కరినీ గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ హృదయం వైశాల్యంగా ఉన్నా..శరీరం చిన్నది. మీ అందరికీ పేరుపేరునా.. టీవీల్లో చూస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ థ్యాంక్స్ చెప్పాడు పవన్.

"నేను సినిమాల్లోకి వచ్చినపుడు ఎపుడూ ఇంత అభిమానాన్ని పొందుతానని అసలేమీ అనుకోలేదు. ఇంత అభిమానం సంపాదిస్తా అని కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నా మనసులో ఉన్న కోరిక.. నా వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడే చిన్నపని చేస్తే చాలు. కానీ సినిమాల ద్వారా మీకింత చేరువైనందుకు.. నాదైన కృషి పొలిటికల్ పార్టీ ద్వారా చేయగలిగే అవకాశం ఇచ్చిన సినిమాకి.. నాకింత ప్రేమనిచ్చిన.. ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లే ప్లాట్ ఫాం ఇచ్చిన సినిమాకి.. ఆ తల్లికి.. నా పాదాభివందనాలు" అంటూ కళామతల్లికి కృతజ్ఞతలు తెలిపాడు.

"నేను సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో ఎన్ని సినిమాలు చేస్తావ్ అని ఇంట్లో అడిగితే.. నాకు ఓ పది పన్నెండు కనిపించాయంతే. ఖుషీ తర్వాత ఇంకో ఐదు సినిమాలు చేసి సినిమాల్లోంచి వెళ్లిపోదామని అనుకున్నాను. దానికి కారణం కూడా చెబుతాను. అదేంటంటే.. నాకు దేశం చాలా గొప్పది.. పెద్దది. అంతే తప్ప సినిమా చిన్నదని కాదు. కానీ మీ ప్రేమ నాతో పాతిక సినిమాలు చేసేలా చేసింది. ఈ పాతిక సినిమాల్లో ముఖ్యంగా ఖుషీ తర్వాత.. పోస్ట్ జానీ తర్వాత.. నేనెప్పుడూ ఓటమికి భయపడలేదు. అలాగే గెలుపుతో కూడా ఎప్పుడూ పొంగిపోలేదు. కానీ మనకు సంబంధం లేకుండా మన పని చాలా అసూయ ద్వేషాలను ఇస్తుందని చిత్ర పరిశ్రమలో తెలుసుకున్నాను. ఒక్కోసారి నాకు ఇలాంటి ఫీలింగ్స్ మధ్య సినిమాలు చేయాలంటే.. అవి విరమించుకునేందుకు నా మనసెప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో జానీ అనే సినిమా ఫెయిల్ తర్వాత.. అది ఓటమి అనిపించలేదు" అంటూ ఓటములపైనా రియాక్ట్ అయ్యాడు పవర్ స్టార్.

"కానీ నా చుట్టు పక్కల అందరికీ ప్రాణాలు పోయినంతగా.. తలకొట్టేసినంతగా బాధపడిపోతుంటే .. నాకు నిజంగా వైరాగ్యం వచ్చింది. థామస్ ఆల్వా ఎఢిసన్ బల్బ్ కనిపెట్టబోయే ముందు.. ప్రతీసారి విఫలమయిన తర్వాత.. బల్బ్ ఎలా కనిపెట్టకూడదో తెలుసుకున్నా అన్నారు. ఫెయిల్యూర్ కి ఆయన పెట్టుకున్న పేరు అది. నేను ఫెయిల్యూర్ కి ఎప్పుడూ కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల వాళ్లకి ఇబ్బంది అనిపించినపుడు.. ఇలాంటి మనుషుల మధ్య ఉండకూడదని అనిపించి.. దూరంగా వెళ్లిపోదామని అనుకున్నాను. కానీ దగ్గరిగా ఉన్నవాళ్లు అందరూ.. సన్నిహితంగా ఉన్నవాళ్లు అందరూ ఒకలా భావించినపుడు.. నేను లోపలకు వెళ్లిపోయినా,.. నన్ను సినిమాల్లో ఉంచింది మీరు. నేను చేయూతనిచ్చినవాళ్లు.. నేను అండగా నిలిచినవాళ్లు నాతో ఎప్పుడూ నిలబడలేదు. కానీ మీరు నిలబడ్డారు" అనడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపయింది.

"మీ ప్రేమ మీ అభిమానం.. మీకోసం చొక్కాలు చించుకోవాలని అనిపిస్తుంది. గుండెలు బద్దలు కొట్టకోవాలని అనిపిస్తుంది. ఇందాక మనలో ఒకరు ఇలా వచ్చేసినపుడు.. ఆ అభిమానం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను అర్ధం చేసుకోగలను. నాకు కించపరచాలని ఉండదు. పరిస్థితుల కారణంగా నేరుగా అందరితో కలవలేకపోవచ్చు. కానీ మీ కోసం నా హృదయం ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది" అని పవన్ అనగానే.. ఇక వారిని ఆపడం కష్టమైంది.

"అది నాకు ఇష్టమైన జెండా. భారత దేశపు జెండా. ఆ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతుంది. అలాంటి జెండా కోసం నా దేశం కోసం రాజకీయాల్లోకి వెళ్లాను తప్ప.. వేరే ఉద్దేశ్యంతో కాదు. ఎందుకంటే ఏ కళకు అయినా సరే అంతిమలక్ష్యం సమాజానికి ఉపయోగపడ్డమే. నా అంతిమ లక్ష్యం ఏంటంటే.. శక్తి ఉండగానే వయసు ఉండగానే.. సమాజానికి ఉపయోగపడాలి. సినిమాల ద్వారా మీకెంత చేశానో.. సమాజానికి కూడా.. బహుశా ఉడత సాయమే కావచ్చు.. కానీ నా వంతు కచ్చితంగా మన దేశానికి చేస్తాను" అంటూ పాలిటిక్స్ పై లైటర్ వీన్ లో టచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

"మీరు ఎంత అండగా నిలబడ్డారో.. మీరు ఎంతగా కోరుకున్నారో నాకు తెలుసు. ఒకోసారి నన్ను కొందరు తిట్టేసేవారు. నీకేదో శక్తి లేదు..రా బయటకు రా అంటే.. నేనేం నమ్ముతానంటే ఎప్పుడూ కాలం శక్తినే నమ్ముతాను. నేను నిమిత్తమాత్రుడను అని నాకు తెలుసు. కాలం శక్తి చాలా గొప్పది. నేను సినిమాల్లోకి వచ్చినా.. మీ గుండెల్లో ఇంతగా చోటు సంపాదించినా.. అది కాలం శక్తి మాత్రమే. నేను ఒక పరికరాన్ని మాత్రమే. అది నాకు బాగా తెలుసు. కానీ నేను ఇలా ఉన్నపుడు నాకు శక్తి లేదు. నాకు భయం ఉంది. కానీ నిరాశా నిస్పృహలూ ఉంటాయి. సినిమాలు వదిలి వెళ్లలేను" అన్నాడు పవన్.

"ఇలాంటి సమయంలో నేను అండగా నిలబడ్డ సన్నిహితులు నిలబడలేదు. నేను చేయూతనిచ్చిన హితులు నిలబడలేదు. కానీ ఎప్పుడో గోకులంలో సీత సినిమాకి అసిస్టెంట్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు. ఒక సినిమా విజయం సాధిస్తే మనుషులుంటారు. గెలుస్తున్నపుడు మనుషులుంటారు. కిందకు వెళ్లిపోతున్నపుడు ఓటమి పాలవుతున్నపుడు ఒక్కరూ ఉండరు. అది నాకు బాగా తెలుసు. మీరున్నారు.. మీరు ఎప్పుడూ నన్ను వదలలేదు. నేను చెప్పేది నా చుట్టుపక్కల ఉన్నవారి గురించి మాత్రమే. అలాంటి సమయంలో నిలబడ్డ ఒకే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్" అంటూ తమ బంధం గురించి తెలిపాడు.

"ఆయన వచ్చి మీరు బయటకు రావాలి.. సినిమాలు చేయాలి అంటూ విసిగించేవారు. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. జల్సా సినిమా స్క్రిప్ట్ తెచ్చారు. ఆ సినిమా ఆడింది.. డబ్బులు బాగా వచ్చాయని నాకు ఎవరూ చెప్పలేదు. మూడు నాలుగేళ్ల తర్వాత ఆ విషయం తెలిసింది. నాలుగు గోడల మధ్య.. మీ గుండెల్లో బతికేవాడిని తప్ప వేరే ప్రపంచం తెలీదు. నా దగ్గర వాళ్లు కూడా నాతో.. త్రివిక్రమ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు.. సలహాలు ఇస్తారు అంటూ ఉంటారు. మేము దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారం మేమిద్దరం. ఎవరైనా త్రివిక్రమ్ గురించి నా దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తుంటే నాకు హాస్యాస్పదంగా ఉంటుంది" అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు.

"ఆయనకు నేనేం ఇవ్వగలను. నేను లేకపోతే ఆయన లేరా. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన వ్యక్తి.. గోల్డ్ మెడలిస్ట్.. ఓ గొప్ప రచయిత.. ఆయన నాతో దర్శకుడు కాలేదు. స్వశక్తితో దర్శకుడు అయారు. నాతో ఆయనకు అవసరం ఏముంది. నేను కాకపోతే ఇంకొకరు. వందమంది హీరోలు దొరుకుతారు. సృజనాత్మకత ఉన్న వ్యక్తికి హీరోలు ఎప్పుడైనా దొరుకుతారు. కానీ  మా ఇద్దరి మధ్య ఉన్నది.. ఒకటే ఆలోచన విధానం.. పెద్దవాళ్లంటే గౌరవం. సినిమా పరిశ్రమ అంటే మోకరిల్లేంత గౌరవం. ఇలాటి భావజాలం మమ్మలను దగ్గర చేసింది. ఓటమిలో పారిపోం. నిలబడతాం. గెలుపు ఉన్నపుడు మేం కనిపించకపోవచ్చు. కానీ ఓటమిలో బైటకొస్తాం. అలాంటి వ్యక్తులం మేము. నా రక్తం పంచుకు పుట్టిన వారిపై కూడా నేను కోప్పడలేను కానీ.. త్రివిక్రమ్ గారిపై కోప్పడగలను. నాకు ఆయనతో అంత చనువు ఉంది. అంత సాన్నిహిత్యం ఉంది. మీతో ఎంతగా హృదయం విప్పి పంచుకోగలనో.. ఆయనతో అంతగా పంచుకోగలను" అంటూ మాంత్రికుడితో తమ అనుబంధం గురించి డీటైల్డ్ గా చెప్పాడు పవర్ స్టార్.

"నేను నిరాశా నిస్పృహలకు లోను అయినపుడు.. కొన్ని కవితలు చెప్పి.. గుంటూరు శేషేంద్ర శర్మ కవితలు చెప్పి.. నాతో బలంగా నిలబడి, నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నపుడు.. ఒక డైలాగ్ ఉంటుంది. వయసుండగానే భుజాలు కుంగిపోయి టన్నుల బరువు మోస్తున్నట్లు అనిపించిందా అనే డైలాగ్ ఉంటుంది. నేను నిజంగా అలాంటి పరిస్థితిలో ఉండేవాడిని. ప్రపంచంలో ప్రతీ సమస్యా నాదే అనుకునేవాడిని. అందుకే మానసికంగా నేను భుజాలు కుంగిపోయినట్లు ఉండేవాడిని"

"నా దగ్గర పరిష్కారాలు లేవు.. బాధే ఉండేది. కానీ నాకు వెన్ను తట్టి గుండె నిండా బలం నింపిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా సినిమాలో మీరు చూస్తున్న ప్రతీ కామెడీ సీన్ వెనుకాల నేను దుఖంతో ఉండేవాడిని. మీకు సరైన వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పి.. ఓ పుస్తకం తెచ్చిచ్చాడు. అది నాదేశం నా ప్రజలు. అది చదువుతున్నపుడు నాకు డిప్రెషన్ పోయింది. ఈ దేశానికి ఏదో చేయగలననే నమ్మకం కలిగింది. ఆ స్ఫూర్తి ఆ ధైర్యం గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకం ద్వారా కలిగింది. అందుకే మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాను"

"సినిమా ఫంక్షన్లలో నా సినిమా చూడండి.. బాగుంటుంది అని చెప్పాలని అనిపించదు. మీకు సినిమా నచ్చినపుడు మనస్ఫూర్తిగా చూడండి.. నచ్చనపుడు ఈజీగా వదిలేయండి. కానీ ఈ ఒక్క సినిమా మాత్రం.. మీకు ఎలా ఉంటే నచ్చుతుందనే ఉద్దేశ్యంతో మాదైన ప్రయత్నం మేం చేశాం. మీకు నచ్చేలా మణికంఠన్ లాంటి సుపీరియర్ సినిమాటోగ్రాఫర్ ను తెచ్చాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు కూడా. సినిమాల్లోకి వచ్చినపుడు ఆనంద్ సాయి అని ఫ్రెండ్ ఉండేవారు. ఇప్పుడు ప్రకాష్ గారు బాగా చేశారు. ఆయనకు ఎంతో భవిష్యత్ఉంటుందని నమ్ముతున్నా" అంటూ టెక్నికల్ టీంని ప్రశంసించాడు పవన్ కళ్యాణ్.

"అలాగే ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణ గారు కూడా. నాతో సినిమాలు చేసినవారిలో.. తక్కువలో తీసి ఎక్కువ డబ్బులు చేసుకుందాం అనుకునేవారు. కానీ సినిమాకు ఎంత కావాలంటే అంత పెట్టి.. డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలబడాలనే నిర్మాతలు కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో.. తిరిగి పాత కాలపు విలువలను తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఎవరైతే మాపై పెట్టుబడి పెడతారో.. ఎవరైతే టికెట్ కొని థియేటర్ కి వస్తారో.. వారు కోరుకున్నది అందించకపోతే.. అది ద్రోహం అవుతుంది. చాలా తప్పు కూడా. నేను డబ్బులు వదులు కోవడానికి ఎందుకు సిద్ధమవుతామంటే.. డబ్బులు దోచేయాలనే ఫీలింగ్ ఉండకూడదు. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణలో కనిపించారు. థ్యాంక్యూ సార్" అని ప్రొడ్యూసర్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు.

"అలాగే నాకు ఇష్టమైన పాట.. కొలవెరి. ఆ పాట చాలా వింటూ ఉంటాను. నేను ఒక్కడినే ఉన్నపుడు డ్యాన్స్ చేసే పాట అది. మీరెవరూ చూడలేదు కూడా. సినిమాల్లో డ్యాన్స్ చేయకపోవచ్చేమో కానీ.. ఒక్కడినే ఉన్నపుడు మాత్రం ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు మైకేల్ జాక్సన్ తర్వాత అంత ఇష్టమైన మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్. ఆది గురించి చెప్పాలంటే.. వాళ్ల నాన్నగారితోటి నా మొదటి  సినిమా చేయాల్సి ఉంది. కానీ కుదరలేదు. అప్పటి నుంచి ఆది నాకు తెలుసు. ఆది చెప్పినవన్నీ చేశానని నాకు గుర్తు లేదు కూడా. థ్యాంక్యూ ఆది."

"నాకు స్నేహితుల్లాంటి శ్రీనివాస రెడ్డి గారు.. నర్రా.. నాకిష్టమైన భరణి గారు.. రావు రమేష్ గారు.. శర్మ గారు.. అలాగే బొమన్ ఇరానీ గారు.. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను తెలియచేసేది ఏంటంటే.. మా వంతు కృషి మేం చేశాం. అను ఇమాన్యుయేల్.. కీర్తి సురేష్.. నాకు హీరోయిన్లతో సినిమాలతో చేస్తున్నపుడు వారు గొంతు ఇవ్వడం చాలా తక్కువ సార్లు కనిపించింది. వీరి ప్రొఫెషనలిజంకు..వారి సిన్సియారిటికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా కోసం భారత దేశం ప్రతీ మూల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు "

"బొమన్ ఇరానీ.. ఫైట్ మాస్టర్.. తమిళనాడు నుంచి ఖుష్బూ గారు.. ఇలా దేశమంతా కలిసి అజ్ఞాతవాసిలో ఉన్నారు. నేను ఇది గర్వకారణంగా భావిస్తాను. మీ అందరికి ఇంకోసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ.. మీ ప్రేమ అభిమానాలు చిరకాలం ఉండాలని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నాను. జైహింద్" అంటూ తన స్పీచ్ ముగించాడు  పవన్ కళ్యాణ్.
Tags:    

Similar News