ఇటీవల టాలీవుడ్ లో అగ్ర కథానాయకులంతా కూడా రీమేక్ కథలపైనే దృష్టిపెట్టారు. కొత్త కథల్ని నమ్మి సాహసాలు చేయడం కంటే పొరుగు భాషల్లో ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాల్నే రీమేక్ చేయడం మేలని నమ్ముతున్నారు. అందుకే చిరంజీవి మొదలుకొని పలువురు కథానాయకులు రీమేక్ కథల్ని పట్టేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తమిళంలో సక్సెస్ అయిన వేదాలంని తెలుగులో రీమేక్ చేయాలనుకొంటున్నాడు. తమిళంలో అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఇదివరకు కూడా తమిళంలో సక్సెసయిన చాలా సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసి విజయాలు అందుకొన్నాడు పవన్. సో.. ఇప్పుడు కూడా ఆ రకంగానే వేదాలం రీమేక్ లో నటించాలని డిసైడైయ్యుండొచ్చు. అయితే ఈ చిత్రం గురించి వినిపిస్తున్న విషయాలే పవన్ అభిమానుల్ని కాస్త ఆందోళనకి గురిచేస్తున్నాయి.
వేదాలం సినిమాకీ, తెలుగులో ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాకి చాలా దగ్గరి పోలికలున్నాయట. ఊసరవెల్లి తెలుగులో అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి వేదాలంని రీమేక్ చేస్తే ఏం బాగుంటుందనేది పవన్ అభిమానుల ఆలోచన. కానీ వేదాలం సినిమాని చూసిన పవన్ కళ్యాణ్ ముచ్చటపడిపోయాడట. అందుకే వెంటనే ఆసినిమాని రీమేక్ చేయాలని డిసైడైయ్యాడట. మరి పవన్ కళ్యాణ్ ఇదివరకటి ఊసరవెల్లి చూడలేదా? లేక ఆ కథలో మరో కోణాన్ని ఆయన చూశాడా అన్నది తెలియాల్సి వుంది. అయితే పవన్ ఏదైనా రీమేక్ చేస్తే దాన్ని పక్కాగా తెలుగు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయిస్తుంటారు. సో... ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఆయన వేదాలం రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకొని వుండొచ్చేమో!