భీమ్లా .. వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ మెరుపులు మెరిపిస్తారా?

Update: 2022-02-17 12:30 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చ‌ర్చ మొద‌లైందా? అంటే య‌స్ అనే స‌మాధానం వినిపిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే... ఏపీ ప్ర‌భుత్వం గత కొన్ని నెల‌లుగా బిగ్ మూవీస్ కి టికెట్ రేట్లు పెంచ‌కూడ‌దని జీవోని తీసుకొచ్చింది.

అంతే కాకుండా ఏపీ థియేట‌ర్ల‌లో వంద శాతం ఆక్యుపెన్సీని ఎత్తేసి 50 శాతం ఆక్యుపెన్సీ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. అంతే కాకుండా క‌రోనా థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూని కూడా విధిస్తూ స‌రికొత్త నిబంధ‌న‌ల్ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది.

తాజాగా థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు మంజూరు చేస్తూ నైట్ క‌ర్ఫ్యూని కూడా ఎత్తేస్తూ గురువారం ప్ర‌క‌టించింది. అయితే బిగ్ మూవీస్ కి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని క‌ల్పించే జీవోని మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

ప్ర‌త్యేకంగా దీనిపై భేటీ జ‌రిగినా ఇంత వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం.. సంబంధిత శాఖ ఎలాంటి నిర్ణ‌యానికి రాలేదు. అయితే  ఇదే స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన క్రేజీ చిత్రం `భీమ్లా నాయ‌క్ ` విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

`వ‌కీల్ సాబ్‌` చిత్రం త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియోల‌తో సినిమాపై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. రానా, నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌డం.. త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాకు మ‌రింత హైప్ ని తీసుకొచ్చింది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21న‌ భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు. యూస‌ఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై  ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఈ ఈవెంట్ కోసం యావ‌త్ ఇండ‌స్ట్రీ తో పాటు సినీ ప్రియులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

చాలా రోజుల త‌రువాత సినిమా ఈవెంట్ లో పాల్గొంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా స్పందించ‌బోతున్నారు? .. ఆయ‌న నుంచి ఎలాంటి మాట‌లు రాబోతున్నాయి అన్న‌ది ఇప్ప‌డు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్ర‌భుత్వంపై.. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తో పాటు ప‌లువురు వైసీపీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

`వ‌కీల్ సాబ్‌` టైమ్ లో ఏపీ ప్ర‌భుత్వ విధానాల కార‌ణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న ప‌వ‌న్ ఈ సారి కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తే మాత్రం ఊరుకోర‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో `భీమ్లా నాయ‌క్‌`ని కూల్ గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ తో పాటు బ‌య్య‌ర్స్ కూడా భావిస్తున్నారు.

అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి భారీ ఆఫ‌ర్లు అందించి సొంతం చేసుకున్న బ‌య్య‌ర్లు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ప‌వ‌న్ ఎలా స్పందిస్తారా అని భ‌య‌ప‌డుతున్నార‌ట‌.

మ‌రి ప‌వ‌న్ స్మూత్ గ‌త సినిమా గుఇంచే మాట్లాడి సైలెంట్ అవుతారా?  లేక `రిప‌బ్లిక్‌` ఈ వెంట్ లో మాట్లాడిన‌ట్టుగా నే ఏపీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.
Tags:    

Similar News