డైరెక్టర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సిద్ధమైన హీరోయిన్...!

Update: 2020-09-21 17:34 GMT
బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రధాని మోదీకి ట్వీట్ చేస్తూ తనకు న్యాయం కోరింది. ''అనురాగ్‌ కశ్యప్‌ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. ఈ క్రియేటివ్ వ్యక్తి వెనుక ఉన్న రాక్షసుడిని ప్రజలకు చూపెట్టండి. ఇలా చెప్పడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. నాకు సాయం చేయండి'' అని ట్వీట్ చేసింది. అయితే పాయల్‌ తనపై చేసిన ఆరోపణలను అనురాగ్‌ కశ్యప్‌ ఖండించారు.

"నువ్వు నాపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. నాపై ఆరోపణలు చేసే క్రమంలో నాతో పనిచేసిన నటీమణులను, బచ్చన్‌ ఫ్యామిలీని కూడా ఈ వ్యవహారంలోకి లాగావు. నువ్వొక అమ్మాయిగా ఉండి ఇతర అమ్మాయిలను ఈ వివాదంలోకి లాగావు. దేనికైనా ఓ లిమిట్‌ ఉంటుంది. నేను రెండుసార్లు పెళ్లి చేసుకున్నాను. అదే నా నేరమైతే నేను అంగీకరిస్తాను. నా మొదటి భార్య, రెండవ భార్య లేదా నా ప్రేయసి కావచ్చు లేదా నాతో పనిచేసిన నటీమణులు కావచ్చు.. అందరిపై మీరు ఆరోపణలు చేశారు. మీ ప్రవర్తన భరించలేనిది. మీ వీడియో చూస్తే అందులో నిజానిజాలెంత ఆనే విషయాలు తెలుస్తున్నాయి. మీ ఇంగ్లీషుకు హిందీలో సమాధానం ఇచ్చినందుకు క్షమాపణలు" అని అనురాగ్‌ కశ్యప్‌ ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు అనురాగ్‌ కశ్యప్‌ కు మద్ధతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ - తాప్సీ పొన్ను - అనుభవ్ సిన్హా - రాధికా ఆప్టే - కల్కి కొచిన్ వంటి వారు అనురాగ్ కశ్యప్ అలాంటి వాడు కాదని తెలిపారు. మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాయల్ ఆరోపణలను సమర్ధిస్తూ అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలని కోరింది. ఈ క్రమంలో పాయల్‌ ఘోష్‌ 'మీ టూ' ని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేసింది. ''ప్రజలు ప్రతిదానికీ మహిళలను నిందిస్తారు. మాతృస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు. ఇది మహిళల పక్కన నిలబడాల్సిన సమయం. వారు చెప్పేది వినండి. మహిళల స్వరాన్ని అణచివేతకు గురిచేసే తరం పోయింది. ఇది 2020. కమాన్ ఇండియా! #MeToo'' అని ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా, పాయల్‌ ఘోష్‌ తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. 'నేను ఈ రోజు అనురాగ్ కశ్యప్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తాను. వారు ప్రభావవంతమైన వ్యక్తులు మరియు వారు నాకు హాని కలిగించవచ్చని నాకు చాలా మంది చెప్పారు. అందుకే నేను ఎఫ్ఐఆర్ దాఖలు చేసి భద్రత కోరుతాను. ఈ విషయం గురించి మా నాన్న చాలా భయపడ్డాడు. నన్ను వెంటనే హైదరాబాద్ వెళ్ళాలని కోరాడు. కాని నేను ఎందుకు నా ఇంటిని వదిలి వెళ్ళాలి?' అని ప్రశ్నించింది. ఇక పలువురు హీరోయిన్లు అనురాగ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటంపై స్పందిస్తూ.. ''సహజంగానే వారు అతనికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే వారు తరువాత రోజుల్లో వారికి ఎక్కువ పని ఇస్తారని వారు ఆశిస్తున్నారు. నేను దీనిని ముందే ఊహించాను. అతను బాలీవుడ్లో ప్రభావవంతమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. ఇది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. అతను ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. అతనికి మద్దతు ఇస్తున్న ఈ అమ్మాయిలకు కూడా నేను చెప్పేది సరైనదని తెలుసు. నేను చెప్పిన అమ్మాయిల పేర్లు అతను నాకు చెప్పకపోతే అవి నా మనసులోకి ఎలా వస్తాయి?. అతనే నాకు చెప్పాడు. అతను నాకు ఏమి చెప్పాడో అదే నేను చెప్పాను'' అని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News