ప్ర‌భాస్ క్రేజును వాడేసుకుందామ‌ని..

Update: 2016-08-14 04:34 GMT
గ‌తంలో ఒక సినీ ఫ్యామిలీలో ఇద్ద‌రు కుర్రాళ్లుంటే ఒక‌రు హీరో అయి.. ఇంకొక‌రు నిర్మాణంలోకి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అలా వార‌సులు ప‌క్క చూపులు చూడ‌ట్లేదు. అంద‌రూ హీరోలే అవుతున్నారు. హీరో కొడుకులు మాత్ర‌మే కాదు.. వాళ్ల మేన‌ల్లుళ్లు.. ఇంకేదైనా చుట్ట‌రికం ఉన్న‌వాళ్లు సైతం హీరోలైపోతున్నారు. వెండితెర‌పై వెలిగిపోవ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఒక‌సారి హీరోగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన‌వాళ్లు కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఇలాగే ప్ర‌య‌త్నించి హీరోగా తొలి విజ‌యాన్నందుకున్నాడు. ఇదే కోవ‌లో ప్ర‌భాస్ క‌జిన్ సిద్దార్థ్ సైతం హీరోగా మ‌రో ప్ర‌య‌త్నం చేయబోతున్నాడు. ఎప్పుడో ఐదేళ్ల కింద‌ట ‘కెర‌టం’ అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతో చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొని.. ఆ త‌ర్వాత అదృశ్య‌మైపోయిన సిద్ధార్థ్ ఇప్పుడు మ‌రోసారి హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు.

‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిన నేప‌థ్యంలో అత‌డి పేరు ఉప‌యోగించుకుని  హీరోగా సెటిలవుదామ‌ని చూస్తున్న‌ట్లున్నాడు సిద్దార్థ్‌. ప్ర‌భాస్ క‌జిన్ సిద్దార్థ్ హీరోగా రీఎంట్రీ అంటూ ప్రెస్ నోట్ ఇవ్వ‌డం చూస్తే అదే అనిపిస్తోంది మ‌రి. సిద్దార్థ్ త‌న చ‌దువు పూర్తి చేసి తిరిగి సినిమాల్లోకి వ‌స్తున్న‌ట్లు ఇందులో పేర్కొన్నారు. ‘ప్రియుడు’ సినిమా తీసిన పి.ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా సురేష్ రేపల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Tags:    

Similar News