ప్ర‌భాస్ 21 .. దీపిక‌కు అంతిస్తే డార్లింగ్ కి ఎంత‌?

Update: 2020-08-06 04:15 GMT
ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారీ అట్టుడికిస్తుంటే మ‌రోవైపు టాలీవుడ్ నిర్మాత‌లు ఎందులోనూ త‌గ్గ‌డం లేదు. ఈ సీజ‌న్ లో ప్ర‌భాస్ తో భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించింది వైజ‌యంతి మూవీస్. మ‌హానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశాన్ని ఎంచుకుని పాన్ ఇండియా మార్కెట్ ని కొల్ల‌గొట్టే ప్ర‌ణాళికతో ద‌త్ - అశ్విన్ బృందం రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం బాహుబ‌లి స్టార్ ని ఎంపిక చేసుకోవ‌డం అనంత‌రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనేను ఎంపిక చేసుకోవ‌డం తెలిసిన‌దే. క్రైసిస్ ని లెక్క చేయ‌క‌.. అసాధార‌ణ బ‌డ్జెట్ తో ద‌త్ జీ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తావిచ్చింది.

అయితే ఈ మూవీలో న‌టించేందుకు దీపిక ప‌దుకొనే డిమాండ్ చేసిన పారితోషికం ప్ర‌స్తుతం తెలుగు సినీవ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ ఈ భామ పారితోషికం ఎంత‌? అంటే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఒక సినిమాకి అందుకునేంత పారితోషికాన్ని దీపిక డిమాండ్ చేసింద‌ని తెలుస్తోంది. దాదాపు 20 కోట్ల పారితోషికం.. అలాగే ప్ర‌యాణం బ‌స ఖ‌ర్చులు స్టాఫ్ జీతాలు వ‌గైరా అద‌నం అని తెలిసింది. ఓవ‌రాల్ గా 22 కోట్ల మేర ఈ అమ్మ‌డికి చెల్లించాల్సి ఉంటుంద‌ట‌.

బాహుబ‌లి 2 కోసం ఆర్కా మీడియా 250కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేసింది. ఆర్.ఆర్.ఆర్ కోసం డివివి దాన‌య్య అంత‌కుమించిన బ‌డ్జెట్ ని పెడుతున్నారు. ఇప్పుడు ఆ రెండిటినీ త‌ల‌ద‌న్నే బ‌డ్జెట్ ని ప్ర‌భాస్ 21 కోసం అశ్వ‌నిద‌త్ ఖ‌ర్చు చేయ‌నున్నారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హ‌మ్మారీ విల‌యంలో అగ్ర హీరోలు హీరోయిన్లు పారితోషికాలు త‌గ్గించుకోవాల‌న్న డిమాండ్ నిర్మాత‌ల నుంచి ఉంది. అలాంట‌ప్పుడు దీపిక‌కు అంత పెద్ద మొత్తం పారితోషికం చెల్లించేందుకు ద‌త్ సాహ‌సిస్తున్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. దీపిక‌కే అంత పెద్ద మొత్తం చెల్లిస్తే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కి ఇంకెంత పారితోషికం చెల్లిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

స్క్రిప్ట్ ను బలంగా న‌మ్మి ద‌త్ సాహ‌సాలు చేస్తున్నారు. భారీ చిత్రాలు తీయ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. అయితే ఆయ‌న కరోనా వైరస్ స‌న్నివేశాన్ని కూడా ప‌ట్టించుకోకుండా అసాధార‌ణ బ‌డ్జెట్ తో ఈ సినిమా  చేస్తుండ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం ఈ సంవత్సరం చివ‌రిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభమవుతుంది. 2022 లో విడుద‌ల‌వుతుంది. హిందీ స‌హా ఐదు భాషలలో విడుదల చేస్తార‌ని స‌మాచారం.
Tags:    

Similar News