నితిన్ డైరెక్టర్.. ఓ ఆసక్తికర కథ

Update: 2015-08-25 12:00 GMT
సినిమాల్లో హవా తగ్గిపోయాక బుల్లితెరకు వెళ్లిన నటీనటులు, దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యేవాళ్లు చాలా తక్కువమంది. టీవీ సీరియళ్లకు పని చేసిన వాళ్ల టాలెంట్ మీద సినిమా వాళ్లకు సదభిప్రాయం ఉండదు. కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. ఐతే రాజమౌళి, సాయిమాధవ్ బుర్రా లాంటి ప్రతిభావంతులు ముందు బుల్లితెర మీద సత్తా చాటుకుని వచ్చినవాళ్లే అన్న సంగతి మరువరాదు. ఐతే సాంకేతిక విభాగాల్లో పని చేసి రావడం మామూలే కానీ.. ఓ టీవీ నటుడు సినిమాకు డైరెక్షన్ చేయడమన్నది అరుదుగా జరుగుతుంటుంది. నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ప్రేమ్ సాయి ఈ అరుదైన కేటగిరికే చెందుతాడు.

తెలుగులోకి వచ్చే తమిళ డబ్బింగ్ సీరియళ్లు చూసేవారికి ప్రేమ్ సాయి బాగానే పరిచయం. అతను తమిళ టెలివిజన్ రంగంలో పెద్ద స్టార్. నితిన్ మాటల్లో చెప్పాలంటే బుల్లితెర మెగాస్టార్. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా రెండు అవార్డులు కూడా  అందుకున్నాడు. నటుడిగా బాగా సంపాదించి కోటీశ్వరుడైన ప్రేమ్ సాయికి ఉన్నట్లుండి దర్శకత్వం మీద కోరిక పుట్టింది. అంతే.. బ్రహ్మాండంగా సాగుతున్న కెరీర్ ను వదిలేసి ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. అక్కడ రెండు మూడేళ్లు పని చేశాక దర్శకత్వం చేయడానికి కథలు రెడీ చేసుకుని నిర్మాతల్ని కలవడం మొదలుపెట్టాడు. ఐతే కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ చెబితే ఎవ్వరూ అతడికి అవకాశం ఇవ్వలేదట. ఐతే గౌతమ్ మీనన్ కు ఆ కథ నచ్చింది. తమిళంలో జై తో, తెలుగులో నితిన్ తో సినిమా మొదలుపెట్టాడు. కానీ అనుకోని అవాంతరాలతో మొదలైన మూడేళ్లకు విడుదల కాబోతోందా సినిమా. ఆలస్యమైతే అయింది కానీ.. సినిమా సక్సెస్ అయిందంటే ప్రేమ్ సాయి ఆరేళ్ల కిందట వేసిన డేరింగ్ స్టెప్ కి ఫలితం దక్కినట్లవుతుంది.
Tags:    

Similar News