జంతువుల‌తో షూటింగ్ అనుమ‌తులు ఎలా?

Update: 2019-05-08 11:15 GMT
మ‌న సినిమాల్లో కుక్క‌.. పిల్లి.. ఎలుక లాంటివి క‌నిపించ‌డం కూడా అరుదు అయిపోయింది. ఒక‌ప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి ద‌ర్శ‌కులు ఏనుగు ప్ర‌ధాన పాత్ర‌లో `రాజేంద్రుడు -గ‌జేంద్రుడు` లాంటి క్లాసిక్ సినిమాని తీసి మెప్పించారు. ఇటీవ‌లే గ‌జ‌రాజు (గుంకీ) అనే సినిమా కోసం.. బాహుబ‌లి కోసం ఏనుగుల్ని ఉప‌యోగించారు. కొన్ని సినిమాల్లో పెంపుడు జంతువుల్ని చూపిస్తున్నా .. అవి న‌టించ‌డాన్ని మాత్రం చూప‌డం లేదు. అందుకు కార‌ణం అస‌లు జంతువుల్ని ఉప‌యోగించి .. వాటిచేత న‌టింప‌జేస్తూ సినిమాలు తీసే క‌థ‌లు కూడా త‌గ్గిపోయాయి. ఒక‌వేళ అవ‌స‌రం అనుకుంటే యానిమేష‌న్ లేదా గ్రాఫిక్స్ వంటి టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటున్నారు కానీ ఒరిజినల్ గా యానిమ‌ల్స్ ని అయితే తెర‌పై చూపించ‌డం లేదు. దీనివ‌ల్ల సినిమాల‌కు కృత్రిమ‌త్వం ఇబ్బందిగా మారింది.

అయితే మ‌న మేక‌ర్స్ ఇలానే ఎందుకు చేస్తున్నారు?  ఒరిజిన‌ల్ జంతువుల‌తో చిత్రీక‌ర‌ణలు చేయొచ్చు క‌దా! అంటే అందుకు స‌వాల‌క్ష ఇబ్బందులున్నాయి. జంతువుల‌కు క్యారెక్ట‌ర్లు రాసి సినిమా చేయాలంటే ముందే చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కుల‌కు సంబంధించిన చిక్కులున్నాయి. సినిమా కోసం వాటిని ఇష్టానుసారం హింసిస్తామంటే కుద‌ర‌దు. యానిమ‌ల్ వెల్ఫేర్ బోర్డ్ వాళ్లు, సామాజిక క‌ర్త‌లు అస్స‌లు ఒప్పుకోరు. బ్లూక్రాస్.. పెటా వాళ్ల‌తో బోలెడ‌న్ని తంటాలుంటాయి. చ‌ట్టాలు అనుమ‌తించ‌వు. అందుకే మ‌న‌వాళ్లు ఆల్మోస్ట్ ఆ త‌ర‌హా సినిమాలు తీయ‌డం కూడా మానుకున్నారు. అపుడెపుడో భార‌తీయుడు చిత్రంలో జంతుజాలాన్ని ఒరిజిన‌ల్ గా చూపించారు శంక‌ర్. కానీ ఇప్పుడా సీన్ లేనేలేదు.

అయితే జంతుజాలంతో సినిమా/  టెలివిజ‌న్/  వెబ్ రిలేటెడ్ గా ఏదైనా ప్రోగ్రామ్ చేయాల‌నుకుంటే అందుకోసం య‌జ‌మానుల‌కు ఓ వ‌ర్క్ షాప్ ఉంది అంటూ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా- యానిమ‌ల్ వెల్ఫేర్ బోర్డ్ వాళ్లు (ముంబై) సంయుక్తంగా ఓ ట్రైనింగ్ సెష‌న్ ని నేడు ముంబైలో ఏర్పాటు చేశారు. జంతువుల య‌జ‌మానుల కోసం శిక్ష‌ణ ఇది. షూటింగుల‌కు పెట్స్ ని తీసుకుని వెళ్లాలంటే ముందుగా ఈ వ‌ర్క్ షాప్ లో పాల్గొనాల‌ని ఫిలించాంబ‌ర్ల‌కు ఓ నోట్‌ వ‌చ్చింది. వీటికి సంబంధించిన అనుమ‌తులు మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసేందుకు ఓ వెబ్ సైట్ ని రూపొందించామ‌ని వివ‌రాల్ని వెల్ల‌డించారు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ డాట్ ఓయ‌స్ పీఏఆర్ డాట్ ఎన్ ఐసీ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ లోకి లాగిన్ అయితే అక్క‌డ ద‌ర‌ఖాస్తుల్ని అప్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ట‌. ప్ర‌తిసారీ అనుమ‌తుల కోసం వెళితే అధికారుల నుంచి నానా ర‌కాలుగా చిక్కులు ఎదుర‌య్యేవి. ఆ క‌ష్టం లేకుండా స‌ర‌ళ‌త‌రం చేసేశామ‌ని యానిమ‌ల్ వెల్ఫేర్ బోర్డ్ కార్య‌ద‌ర్శి డా.నీలం బాలా తెలిపారు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో దీనిపై అవగాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మారిన ఈ కొత్త విధానంలో ఎంతో సులువుగా.. స‌ర‌ళ‌త‌రంగా ప‌ని పూర్త‌వుతుంద‌ని నిర్మాత‌ల గిల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ కుల్ మీత్ మ‌క్క‌ర్ అభిప్రాయ ప‌డ్డారు. ఆన్ లైన్ ప్రాసెస్ వ‌ల్ల ప్ర‌తిదీ పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇత‌ర‌త్రా వివ‌రాల‌కు స‌పోర్ట్ @ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఇండియా డాట్ కాం ను సంప్ర‌దించాల్సిందిగా ఈ సంద‌ర్భంగా కోరారు. మొత్తానికి అనుమ‌తుల కోసం తంటాల్లేకుండా.. అడ్డంకులు లేకుండా ప‌ని పూర్త‌యితే సినిమాలు తీసేవాళ్ల‌కు అంత‌కంటే ఏం కావాలి?
    
    
    

Tags:    

Similar News