భారీ బడ్జెట్ సినిమాకు బాహుబలి గుబులు

Update: 2015-07-23 12:13 GMT
రుద్రమదేవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ‘బాహుబలి’ కంటే ముందు రిలీజ్ చేయాలని విశ్వప్రయత్నం చేశాడు గుణశేఖర్. బాహుబలి అద్భుతాల్ని చూశాక ‘రుద్రమదేవి’ జనాలకు ఆనదేమో అన్న కంగారే దానికి కారణం. కానీ గుణశేఖర్ ప్రయత్నాలు ఫలించలేదు. రుద్రమదేవి.. బాహుబలి తర్వాతే విడుదలవుతోంది. బాహుబలిలో అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ చూసి మెస్మరైజ్ అయిపోయిన తెలుగు ప్రేక్షకులు ‘రుద్రమదేవి’ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో చూడాలి. ఐతే ఇక్కడ ‘రుద్రమదేవి’ విషయంలో గుణశేఖర్ కంగారు పడుతున్నట్లే.. తమిళంలో కూడా ఓ సినిమాకు ఇప్పుడు ‘బాహుబలి’ గుబులు మొదలైంది. ఆ సినిమానే ‘పులి’.

తుపాకి, జిల్లా, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో జోరుమీదున్న విజయ్ హీరోగా నటించిన సినిమా ఇది. అతడి ట్రాక్ రికార్డు చూసి.. ఏకంగా పులి మీద రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టేశారు నిర్మాతలు. శంకర్ శిష్యుడు చింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాహుబలి లాగే జానపద తరహా కథాంశంతో తెరకెక్కింది. హన్సిక, శ్రుతిహాసన్, శ్రీదేవి, సుదీప్ లాంటి భారీ తారాగణం ఇందులో నటించారు. ఐతే ‘పులి’ యూనిట్లో ఎవ్వరూ కూడా మొన్నటిదాకా ‘బాహుబలి’ గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

బాహుబలి తమిళనాట కూడా సూపర్ హిట్టయింది. మెజారిటీ ఆడియన్స్ ఆ సినిమా చూశారు. మెస్మరైజ్ అయిపోయారు. మరి బాహుబలి అద్భుతాల్ని చూసిన కళ్లతో ‘పులి’ని చూసి పెదవి విరుస్తారేమో అన్నది వాళ్ల టెన్షన్. ఇప్పటిదాకా తమిళ సినిమాల్లో ఎన్నడూ లేనంత భారీతనంతో జానపద చిత్రం తీస్తున్నామని అనుకున్నారు కానీ.. ఇప్పుడు మాత్రం ‘బాహుబలి’ భయం పట్టుకుంది. సెప్టెంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలితో పోల్చి ‘పులి’ గురించి ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.
Tags:    

Similar News