పూరి రికార్డు నిలిచిపోతుందిలే..

Update: 2017-07-31 10:12 GMT
బాలీవుడ్లో సినిమా మొదలవడానికి ముందే రిలీజ్ డేట్ ప్రకటించేస్తుంటారు. ఐతే వాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంలో పక్కా ప్లానింగ్ తో ఉంటారు. 2018.. 2019 సంవత్సరాలకు కూడా ఇప్పుడే బెర్తులు బుక్ అయిపోతాయి. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే చాలా ముందే డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అందుకు అనుగుణంగా మిగతా విషయాలన్నీ ప్లాన్ చేసుకుంటారు. టాలీవుడ్లో ఇలాంటి ప్లానింగ్ కనిపించదు. మన దగ్గర సినిమాల చిత్రీకరణ కొంచెం వేగంగానే జరుగుతుంది. ఐతే సినిమా మొదలయ్యే సమయానికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం అన్నది అరుదు. షెడ్యూళ్లు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. ఎప్పుడే అవాంతరం వస్తుందో తెలియదు. అందుకే ముందే రిలీజ్ డేట్ ప్రకటించడానికి తటపటాయిస్తుంటారు.

ఒకవేళ ప్రకటించినా.. అన్న మాట ప్రకారం సినిమాను రిలీజ్ చేయడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేయడమే కష్టమంటే.. ఇక ఆ డేటు కంటే ముందే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడం అన్నది ఇంకా అరుదు. ఒకవేళ సినిమా ప్రి పోన్ అయినా కూడా అది రెండు మూడు రోజులో.. ఒక వారమో ఉంటుంది. అలా కాకుండా చెప్పిన డేటు కంటే దాదాపు నెల రోజులు ముందుగా ఒక పెద్ద సినిమాను విడుదలకు సిద్ధం చేయడం అన్నది

ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలోనే లేదేమో. ఈ ఘనత ఒక్క పూరి జగన్నాథ్ కు మాత్రమే దక్కుతుంది. ‘పైసా వసూల్’ ప్రారంభోత్సవం రోజు సెప్టెంబరు 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో కుదిరితే ఇంకా ముందే సినిమాను రెడీ చేస్తాను తప్ప ఆలస్యం మాత్రం చేయను అన్నాడు పూరి. ఐతే ముందు అంటే మహా అయితే వారం అనుకున్నారు కానీ.. మరీ నాలుగు వారాల ముందే సినిమాను రిలీజ్ చేసుకునేంత ఫాస్టుగా సినిమాను రెడీ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కచ్చితంగా ఇది టాలీవుడ్లో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డేనేమో. కాకపోతే మరీ ఇంత స్పీడుగా తీసేశాడంటే.. క్వాలిటీ సంగతి ఎలా ఉంటుందన్నదే నందమూరి అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న విషయం.

Tags:    

Similar News