పుష్ప ఎఫెక్ట్‌... వాలిమై ప్లాన్‌ చేంజ్‌

Update: 2022-01-04 12:30 GMT

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ హీరోగా హెచ్ వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన 'వాలిమై' సినిమా గత రెండేళ్లుగా అభిమానులను మరియు సినీ ప్రేమికులను ఊరిస్తుంది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన వాలిమై సినిమా ను ఈ సంక్రాంతి సీజన్ లో జనవరి 13న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా బాలీవుడ్‌ సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యాక్షన్‌ సన్నివేశాలతో ఉంటుందనే నమ్మకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే వాలిమై ను హిందీలో కూడా డబ్‌ చేస్తే బాగుంటుందని భావించారు. వెంటనే సినిమాను హిందీ వర్షన్‌ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. హిందీలో విడుదలకు ఇంత హడావుడి ప్రకటన వెనుక మరో ఉద్దేశ్యం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాదిన కరోనా ప్రభావం పెరుగుతోంది. దాంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలు అయ్యాయి. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. దాంతో బాలీవుడ్‌ సినిమాలు ఏవీ కూడా విడుదల అవ్వడం లేదు. దాంతో ఇప్పటికే విడుదల అయిన సినిమాలే అక్కడ ఆడుతున్నాయి. పుష్ప సినిమా అక్కడ పాతిక కోట్లు వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం అనుకున్నారు. అలాంటిది ఏకంగా 65 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. అక్కడ ఇంకా కూడా సినిమా మంచి రన్‌ తో షేర్ ను దక్కించుకుంటుంది అంటూ ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. సినిమా వీకెండ్‌ మరియు ప్రత్యేక సందర్బాలు ఏమైన వస్తే మళ్లీ మంచి షేర్‌ ను రాబడుతుందని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ సినిమాలు ఏమీ లేకపోవడం వల్లే ఈ వసూళ్లు అనేది అందరికి తెలిసిన విషయమే. పుష్పకు కలిసి వచ్చినట్లుగా ఉత్తరాదిన వాలిమై కు కూడా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో బోనీ కపూర్‌ ఈ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాదిన పెద్దగా ప్రచారం చేయకుండానే సింపుల్‌ గానే సినిమాను విడుదల చేస్తారు. సాదారణంగా సినిమాను ఓటీటీ లేదా యూట్యూబ్‌ కు ఇచ్చేందుకు అయినా హిందీలో డబ్బింగ్ చేయాల్సిందే. అదే డబ్బింగ్‌ వర్షన్‌ ను ఎందుకు థియేటర్‌ రిలీజ్ చేయకూడుదు.. ఈ సమయంలో వచ్చే కొద్ది మొత్తం అయినా కూడా బెటర్ అన్నట్లుగా మేకర్స్ ప్లాన్‌ చేసి హిందీ రిలీజ్ కు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. హిందీలో సాధ్యం అయినంత ఎక్కువ థియేటర్లలో వాలిమై ను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప మొదటి రోజు కనీసం 20 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ ని కూడా రాబట్టలేక పోయింది. కాని రోజులు గడుస్తున్నా కొద్ది ప్రేక్షకులు పుష్ప ను చూడటం మొదలు అయ్యింది. అలాగే వాలిమై ను కూడా ఉత్తరాది సినీ ప్రియులు ఆధరిస్తారనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తుంది.

అజిత్ కు ఉత్తరాదిన కూడా ఆయన గత చిత్రాలతో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. మరి అది అదృష్టం కొద్ది వాలిమై వసూళ్లుగా మారుతుందా అనేది చూడాలి. పుష్ప ను చూసి హిందీలో విడుదల కాబోతున్న వాలిమై కనీసం పాతిక కోట్లు వసూళ్లు చేసిన కూడా గొప్ప విషయమే. వాలిమై ను తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే తెలుగు లో పెద్ద ఎత్తున సంక్రాంతికి సినిమాలు రాబోతున్నాయి. కనుక వాలిమైకి ఎంత మేరకు ఛాన్స్‌ ఉంటుంది.. వసూళ్ల సాధన అజిత్‌ ఎంత వరకు చేస్తాడు అనేది చూడాలి. వాలిమై లో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి కనిపిస్తుంది. అది థియేటర్ల వరకు జనాలను తీసుకు వెళ్తుందా అనేది చూడాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి మౌత్ టాక్ తో పబ్లిక్‌ పెరితే ఇక్కడ కూడా మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.



Tags:    

Similar News