'పుష్ప' అదిరిపోయే అప్డేట్: 5 భాషల్లో 'దాక్కో దాక్కో మేక' సాంగ్.. ఎప్పుడంటే..?

Update: 2021-08-02 08:35 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి. ఈ క్రమంలో మరో అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం 'పుష్ప' టీమ్ ఓ సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

'పుష్ప' చిత్రం నుంచి 'దాక్కో దాక్కో మేక' అనే ఫస్ట్ సాంగ్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు మ్యూజిక్ అందిస్తున్న రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అప్డేట్ ని వదిలారు మేకర్స్. 'దాక్కో దాక్కో మేక' పాటను 5 ప్రధాన భాషల్లో 5గురు ప్రముఖ సింగర్స్ పాడనున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ సాంగ్ ను హిందీలో విశాల్ దడ్లానీ.. కన్నడలో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తెలుగులో శివమ్.. తమిళ్ లో బెన్నీ దయాల్ అలపించనున్నట్లు వెల్లడించారు.

'పుష్ప' మ్యూజిక్ ప్రమోషన్స్ చూస్తుంటే 'ఆర్.ఆర్.ఆర్' ప్రచార గీతానికి ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారని తెలుస్తుంది. RRR నుంచి 'దోస్తీ' అనే పాటను ఐదు భాషల్లో ఐదుగురు పాపులర్ సింగర్స్ తో పాడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'తగ్గేదే లే' అంటూ 'పుష్ప' నుంచి 'దాక్కో దాక్కో మేక' పాటను అదే రేంజ్ లో విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో, మేకర్స్ ఈ తరహా ప్రమోషనల్ స్ట్రాటజీలు ఫాలో అవుతున్నట్లు అర్థం అవుతుంది.

ఇకపోతే దేవిశ్రీప్రసాద్ - అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటే మ్యూజిక్ పరంగా మరో స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు. ఇప్పుడు 'పుష్ప' మూవీ ఆల్బమ్ పై కూడా అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఆగష్టు 13న రాబోతున్న 'దాక్కో దాక్కో మేక' పాటతో ఈ ఆల్బమ్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపిస్తారేమో. కాగా, 'పుష్ప' చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.



Full View

Tags:    

Similar News