వెనక్కి తగ్గనంటున్న 'రాధే శ్యామ్'.. చెప్పిన తేదీకే థియేటర్లలోకి..!

Update: 2021-09-29 12:14 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ''రాధే శ్యామ్'' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామాకు కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రభాస్ కెరీర్ లో వస్తున్న 20వ చిత్రం. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ విడుదల తేదీలను ప్రకటిస్తున్న నేపథ్యంలో.. 'రాధే శ్యామ్' చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని వదలబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇది 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడిచే వింటేజ్‌ ప్రేమకథ అని హింట్ ఇచ్చాయి. ఇందులో విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణ గా పూజా హెగ్డే కనిపించనున్నారు. భాగ్యశ్రీ - జగపతిబాబు - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం అవుతున్నారు.

'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇక తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్ కు మాత్రం మిథున్ - మనన్ భరద్వాజ్ ద్వయం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' తర్వాత ప్రభాస్ నటిస్తున్న లవ్ స్టోరీ కావడంతో 'రాధే శ్యామ్' పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News