ఆ రెండు హిట్ సినిమాలు నేను చేయాల్సింది: సందీప్ కిషన్

టాలీవుడ్ లో మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సందీప్ కిషన్, ప్రస్తుతం వరుస సినిమాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Update: 2025-01-16 13:59 GMT

టాలీవుడ్ లో మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సందీప్ కిషన్, ప్రస్తుతం వరుస సినిమాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్న ఈ యంగ్ హీరో, నెగిటివ్ రోల్ నుంచి హీరోగా మారిన ప్రయాణంలో డిఫరెంట్ సినిమాలు ట్రై చేశాడు. అలాగే రెండు సూపర్ హిట్ సినిమాలు సందీప్ చేయాల్సి ఉండి, చివరికి అవి ఇతర హీరోలకు వెళ్లాయట. ఆ విషయాన్ని ఇటీవల తెలియజేశాడు.

సందీప్ కిషన్ తన కెరీర్‌ను స్నేహగీతంతో ప్రారంభించినప్పటికీ, ప్రస్థానంలో నెగిటివ్ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తరువాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా తన స్థానాన్ని స్థిరపర్చుకున్నారు. కానీ, ఈ విజయాల తర్వాత వచ్చిన చిత్రాలు తగినంత పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. సరైన కథలను ఎంచుకోవడంలో కొన్నిసార్లు మేకింగ్ పొరపాటు వల్ల పెద్ద బ్రేక్ దక్కలేదు.

తమిళ సినిమాల్లోనూ సందీప్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రాయన్ సినిమాలో ధనుష్‌తో కలిసి నటించిన ఆయన, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, తెలుగులో మాత్రం హీరోగా తన కేరీర్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊరుపేరు భైరవకోన వంటి చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, సందీప్ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం మజాకా అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇటీవల ప్రమోషన్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు త్రినాద్ రావు నక్కినతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కానీ అది ఇప్పటికి సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా, త్రినాద్ రావు దర్శకత్వంలో వచ్చిన నాని నేను లోకల్, రామ్ హలో గురు ప్రేమకోసమే చిత్రాలను తాను చేయాల్సిన అవకాశం వచ్చిందని, కానీ చివరికి అవి షిఫ్ట్ అయ్యాయని తెలిపారు.

ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాలు ఆయన కెరీర్‌కు మంచి మలుపు ఇచ్చేవి కావచ్చని సందీప్ అభిప్రాయపడ్డారు. కానీ, గతంలో కోల్పోయిన అవకాశాలు, ప్రస్తుతం లభించిన ఛాన్సులతో కచ్చితంగా నయం చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. మజాకాపై ఆశలు భారీగా ఉన్నాయని, ఈ చిత్రం తన కెరీర్‌లో కీలకమైనదిగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా విడుదలైన మజాకా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సందీప్ నటన, కథ, మాస్ అప్పీల్ అన్ని కలిసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News