RRR హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన బాలీవుడ్ విశ్లేషకుడు..!

Update: 2021-08-05 05:28 GMT
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ''ఆర్‌ ఆర్‌ ఆర్‌''. ఈ సినిమా విడుదల కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు వీరుల పాత్రల ఆధారంగా కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భీమ్ గా తారక్.. రామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన ట్రిపుల్ ఆర్ టీమ్.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'దోస్తీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ని మొదటి విడుదల చేసింది.

ఎమ్ ఎమ్ కీరవాణి సారథ్యంలో ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్లు పాడిన 'దోస్తీ' పాట విశేష స్పందన తెచ్చుకుంది. ఇందులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయని సినీ అభిమానులు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ట్విట్టర్ వేదికగా ''RRR మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌ గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే 'మగధీర'ను మించిపోయేలా ఉంటుంది అనిపిస్తోంది'' అని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే ఆర్ ఆర్ ఆర్ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. రాహుల్ వర్మ ఇద్దరు హీరోలను ప్రస్తావించకుండా.. కేవలం చరణ్ ను పొగుడుతూ ట్వీట్ పెట్టడం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కు కారణమైంది.

దీనికి తోడు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ బాలీవుడ్ సినీ విశ్లేషకుడి ట్వీట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత ఆజ్యం పోసింది. ఇన్నాళ్లూ ఇద్దరూ మా హీరోలే అంటూ వచ్చిన అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే దాకా వచ్చింది. నిజానికి RRR సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరిలో మెదిలిన ప్రశ్నలు ఇద్దరు స్టార్ హీరోలను ఎలా బ్యాలన్స్ చేస్తారు?, ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తారు? అనేది. స్క్రీన్ స్పేస్ - అభిమానుల అభిప్రాయం అనేవి దృష్టిలో పెట్టుకునే మన స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇలాంటి సమయంలో నందమూరి - మెగా ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించే బాధ్యత తీసుకున్నాడు రాజమౌళి.
 
'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో ఇద్దరు హీరోలు సమానమే అన్నట్లు జాగ్రత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ - హీరోల ఇంట్రోల వీడియోలు.. ఇలా ప్రతీది ఫ్యాన్స్ ని అలరించింది. 'రామరాజు ఫర్ భీమ్' కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ వస్తే.. 'భీమ్ ఫర్ రామరాజు' కు తారక్ గొంతు ఇచ్చాడు. ఇలా ఇద్దరినీ బ్యాలన్స్ చేస్తూ వస్తున్న రాజమౌళి అండ్ టీమ్.. 'దోస్తీ' పాటలో కూడా ఇద్దరికీ సేమ్ స్క్రీన్ టైమ్ తో చూపించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ విశ్లేషకుడి ట్వీట్ వల్ల 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ ఎన్టీఆర్ ను తక్కువ చేస్తోందనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. అతను ట్వీట్ చేశాడు సరే.. దీన్ని చిత్ర యూనిట్ ఎలా షేర్ చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ చేస్తున్నప్పుడు వారి ఫ్యాన్స్ తమ హీరోనే గొప్ప అనే విధంగా కామెంట్స్ చేయడం సహజమే. రామ్ చరణ్ ఆల్రెడీ ఓ హిందీ సినిమా చేసి బాలీవుడ్ తో సంబంధాలు కలిగి ఉండటం వల్లనో ఏమో సదరు ఫిల్మ్ అనలిస్ట్ మెగా హీరోని పొగుడుతూ ట్వీట్ పెట్టాడు. కానీ దాన్ని 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయడనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనసు నొప్పించింది. కచ్చితంగా ఇలాంటివి జక్కన్న కు తెలిసి జరిగి ఉండడు. ట్రిపుల్ ఆర్ బృందానికైనా తెలిసే జరిగిందా అనేది ఆలోచించాలి. ఏదేమైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి మూడేళ్లు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్.. ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అదే విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని సగటు సినీ అభిమాని సూచన.
Tags:    

Similar News