రాజ్ కుంద్రా కేసు: శిల్పాశెట్టికి బిగుస్తున్న ఉచ్చు?

Update: 2021-07-27 07:50 GMT
రాజ్ కుంద్రా కేసులో ఆయన భార్య శిల్పాశెట్టికి ఉచ్చు బిగుస్తోందని పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ అశ్లీల వీడియోల రాకెట్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో శృంగార తారలు షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు. అలాగే రాజ్ కుంద్రాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. తాజాగా రాజ్ కుంద్రాతో సంబంధమున్న పోర్న్ రాకెట్ కేసులో ఈడీ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసు అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారడం.. మనీలాండరింగ్ అంశాలు వెలుగుచూడడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) రంగంలోకి దిగబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గత రెండు రోజులుగా మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ అశ్లీల రాకెట్ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా రాజ్ కుంద్రాపై కొరఢా ఝలిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కాన్పూర్ ఎస్.బీ.ఐ అకౌంట్లను తాజాగా సీజ్ చేశారు. రాజ్ కుంద్రా కేసులో దర్శకుడు తన్వీర్ హస్మీని విచారించారు. పోలీసు విచారణలో తాను అశ్లీల చిత్రాలు తీశానని ఆయన అంగీకరించారని తెలిసింది. దాదాపు 25 అశ్లీల సినిమాలు తీశానని.. వాటిని సాఫ్ట్ అశ్లీల చిత్రాలు అంటారని తన్వీర్ హష్మీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం.

పోర్న్ రాకెట్ కేసు శిల్పాశెట్టి మెడకు కూడా చుట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆమె పాత్రను ధ్రువీకరించేందుకు ఆమె ఫోన్ ను క్లోనింగ్ చేయాలని నిర్ణయించారు. ఫోన్ సీజ్ చేసి అందులోని విషయాలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందని అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

శిల్పాశెట్టి అకౌంట్లోకి కోట్లు రూపాయలు నగదు చేరిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈక్రమంలోనే ఈ బ్యాంక్ అకౌంటర్లు కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాకు జాయింట్ అకౌంట్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన ఆదాయం అంతా ఈ జాయింట్ అకౌంట్లోకి వెళ్లిందని అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ జాయింట్ అకౌంట్ లో భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పలు విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.

రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జాయింట్ అకౌంట్ లో కోట్ల రూపాయలు మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలుస్తోంది. వాటి గురించి పోలీసులు ఆరాతీయగా.. ఇద్దరూ సమాధానం చెప్పలేదట.. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా రెండు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. కనీస బ్యాలెన్స్ కూడా అందులో లేదని గుర్తించారు.

ఈడీ కూడా రాజ్ కుంద్రా కేసులో రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్యాలయం నుంచి భారత్ కు ట్రాన్స్ ఫర్ చేసిన నిధులపై ప్రస్తుతం ఈడీ ఆరాతీసే అవకాశం ఉందని ముంబై పోలీసులు పేర్కొంటున్నట్టు సమాచారం. మనీ లాండరింగ్, ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్ మెంట్ (ఫెమా) చట్టం కింద ర్యాప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.  దీంతో శిల్పాశెట్టికి ఉచ్చు బిగుసుకున్నట్టేనన్న ప్రచారం ముంబై మీడియాలో సాగుతోంది.
Tags:    

Similar News