అప్పటి రైటర్ ఇప్పుడు క్లిక్ అవుతాడా?

Update: 2016-06-08 17:30 GMT
సందీప్ కిషన్ - నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాజసింహ. ఈ మధ్య కాలంలో ఈయన పేరు పెద్దగా వినిపించడం లేదు కానీ.. ఓ రెండు దశాబ్దాల క్రితం రైటర్ గా ఈయన బాగా ఫేమస్.

మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా చిత్రంలో బ్రహ్మీ ఎపిసోడ్ ని రాసింది ఈయనే. చిరు-బ్రహ్మీ కాంబినేషన్ లో వచ్చే ఈ ఎపిసోడ్ ఆ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచిందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కామెడీ ఎపిసోడ్స్ ను రాయడంలో సూపర్బ్ గా క్లిక్ అయిన రాజసింహ ఆ తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్నారు. గతేడాది వచ్చిన చారిత్రక చిత్రం రుద్రమదేవిలో.. బన్నీ చేసిన గోన గన్నారెడ్డి ఎపిసోడ్ కు రచయిత కూడా ఈయనే. ఒక అమ్మాయి తప్ప స్టోరీని ఎప్పుడో రాసుకున్న రాజసింహ.. ఆ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ ప్రొడ్యూసర్ ను ఒప్పించేందుకు 8 ఏళ్ల సమయం పట్టిందని చెబుతున్నాడు.

ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ రైటర్.. ఇప్పుడు దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండడంతో.. టాలీవుడ్ ఈ సినిమా రిజల్ట్ పై చాలా ఆసక్తిని కనబరుస్తోంది. అయితే.. కొంతమంది ఆలోచనలకు కాలంతో సంబంధం ఉండదని.. ఎప్పటికీ వారి థాట్స్ ఫ్రెష్ గానే ఉంటాయని.. అలాంటివారిలో రాజసింహ కూడా ఒకడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమవుతాయో లేదో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News