జక్కన్న, పెద్దన్న.. అండగా నిలిచారు

Update: 2015-12-14 15:30 GMT
ఈ రోజుల్లో చిన్న సినిమాను తీయడం కంటే దాన్ని విడుదల చేసుకోవడం చాలా కష్టమైన పని. కొంచెం పెద్ద హ్యాండ్స్ ఏవైనా పడితే తప్ప చిన్న సినిమా బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఐతే కంటెంట్ ఉన్న సినిమాల్ని పెద్ద నిర్మాతలు తెలివిగా గుర్తించి..  మొన్న దసరాకు ‘రాజు గారి గది’ సినిమాను సాయి కొర్రపాటి - అనిల్ సుంకర కలిసి ఇలాగే రిలీజ్ చేశారు. మంచి ఫలితం అందుకున్నారు. ఇప్పుడిలాగే ‘జత కలిసే’ అనే ఇంకో చిన్న సినిమాను సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఓంకార్ తమ్ముడు అశ్విన్ - తేజస్వి జంటగా కొత్త దర్శకుడు రాకేశ్ శశి రూపొందించిన ‘జత కలిసే’ గురించి సాయి చేతుల్లోకి వచ్చేదాకా పెద్దగా తెలియదు. ఆయన హ్యాండ్ పడగానే అందరిలో ఆసక్తి మొదలైంది. ఇప్పుడిక ఆడియో ఫంక్షన్ కూడా గట్టిగానే చేసి మరింత ఆసక్తి పెంచాడు సాయి. రాజమౌళి - కీరవాణి - నారా రోహిత్ - అనిల్ సుంకర - ఓంకార్ - అవసరాల శ్రీనివాస్ - తారకరత్న లాంటి వాళ్లను పిలిచి బాగానే హడావుడి చేశాడు. ముఖ్యంగా రాజమౌళి - కీరవాణి వచ్చి సినిమా గురించి మంచి మాటలు మాట్లాడ్డం ‘జతకలిసే’కు బాగా ప్లస్సయ్యే విషయమే.

సినిమా చాలా ఎంటర్ టైనింగ్‌ గా ఉంటుందని ఆశిస్తున్నానని, సాయి కొర్రపాటి ఇలాంటి సినిమాల్ని బాగా ఆదరించాలని రాజమౌళి అంటే.. హ్యాపీ డేస్ సినిమాకు దిల్ రాజు సహకరించినట్లు, ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాలకు సాయి అండగా నిలుస్తున్నారని కీరవాణి కితాబిచ్చాడు. మొత్తానికి తనకు సన్నిహితులైన వ్యక్తులందరినీ పిలిచి.. వాళ్లతో సినిమాను బాగానే ప్రమోట్ చేయించాడు సాయి. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News