రాజమౌళి- అమీర్ ఖాన్‌కు సాధ్యం కానిది..!
పురాణేతిహాసం- మహాభారతాన్ని సినిమాగా తీయాలంటే దానికోసం అయ్యే బడ్జెట్లు, కేటాయించాల్సిన సమయం, భారీ సెటప్‌ల గురించి ఫిలింమేకర్స్ చాలా భయపడతారు.;
పురాణేతిహాసం- మహాభారతాన్ని సినిమాగా తీయాలంటే దానికోసం అయ్యే బడ్జెట్లు, కేటాయించాల్సిన సమయం, భారీ సెటప్‌ల గురించి ఫిలింమేకర్స్ చాలా భయపడతారు. భారీతనం నిండిన సెట్లు, కాస్ట్యూమ్స్, విజువల్ గ్రాఫిక్స్, స్టార్ కాస్టింగ్ పారితోషికాలు వగైరా వగైరా చాలా విషయాలు ఝడిపిస్తాయి. భారతీయ ప్రేక్షకులకు అదృష్టవశాత్తూ బుల్లితెరపై పరిమిత బడ్జెట్ సీరియళ్లతో మహాభారతం కథలను వీక్షించే అవకాశం కలిగింది. మహాభారతం పూర్తి సినిమాని తెరపై చూపించడం సులువు కాదు గనుక, దానిలోని కొన్ని ఎపిసోడ్స్ ని తీసుకుని సినిమాలుగా తీసారు కొందరు.
కానీ ఇప్పడు మహాభారతంపైనే సినిమా తీస్తున్నానని ప్రకటించేశాడు లింగుస్వామి. వరుస పరాజయాలతో అంతగా క్రేజ్ లేని లింగుస్వామి నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యపరిచింది. నిజానికి మహాభారతంపై సినిమాలు తీయాలని దర్శకధీరుడు రాజమౌళి చాలా కాలంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మహాభారతం సినిమాని అధికారికంగా ప్రకటించాక కూడా ఆపేసాడు. 1000 కోట్ల బడ్జెట్ తో రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్స్ సమర్పణలో మహాభారతం సిరీస్‌ని అమీర్ భారీగా ప్లాన్ చేయాలనుకున్నాడు.. కానీ ఫెయిలయ్యాడు.
బాహుబలి తర్వాత రాజమౌళి `మహాభారతం` ఆధారంగా సినిమాలు చేస్తారని కథనాలొచ్చాయి. కానీ దిగ్ధర్శకుడికి ఇప్పటివరకూ కుదరలేదు. ఇప్పుడు లింగుస్వామి ఏకంగా ప్రకటించేసాడు. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో మహాభారతంపై సినిమాని తెరకెక్కిస్తున్నామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అయితే అతడు కూడా వెటరన్ డైరెక్టర్స్ తరహాలోనే మహాభారతంలోని ఒక ఘట్టంపై మాత్రమే సినిమాలు తీస్తాడు. అతడి ప్రకారం.... ఈ చిత్రం పౌరాణిక పాత్రలైన అర్జునుడు, అభిమన్యుల చుట్టూ కథాంశం తిరుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహాభారతాన్ని రెండు భాగాలుగా నిర్మించాలని లింగుసామి భావిస్తున్నాడు. అయితే, విస్తృతమైన ప్రీ-ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభం కాదు. మీడియా వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక మహాభారతాన్ని ప్రారంభించే ముందు లింగుసామి ఒక తెలుగు సినిమాని కూడా పూర్తి చేస్తాడని తెలిసింది. శతాధిక చిత్రాల కథానాయకుడు రోషన్ తో ఈ సినిమాని తక్కువ సమయంలో పూర్తి చేయనున్నాడని సమాచారం.