బర్త్ డే స్పెషల్: జై జై జక్కన్న..

Update: 2015-10-10 04:29 GMT
మన తెలుగు సినిమా స్టామినా ఎంతా అని ఎవరన్నా అడిగిన ప్రశ్నకు మీసం మెలేసి మా రాజమౌళి చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లకున్నంత పొగరంత అని గర్వంగా చెప్పుకునే స్థితికి మన సినిమాను తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి.  జక్కన్న నటులకిష్టమైన దర్శకుడు. ఓ దర్శకుడిలో దాగున్న నటుడు.. ఇదే అతని విజయ రహస్యం. ఓ పక్క దర్శకుడి గానూ మరోపక్క నటుడిగాను చివరికి ప్రేక్షకుడిగానూ సంతృప్తి చెందాకే ఆ సీన్ ఎడిటింగ్ టేబుల్ దాటి మనముందుకొస్తుంది.

భావోద్వేగాలను పండించడంలో రాజమౌళి దిట్ట. రౌద్ర రసం - ప్రతీకార వాంచ తెరకెక్కించడంలో ఆయనో సామ్రాట్. ఇండస్ట్రీలో హిట్ల రేంజ్ వున్న హీరోలకు బ్లాక్ బస్టర్ లను - బ్లాక్ బస్టర్ రేంజ్ వున్న హీరోలకు ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన ధీరుడు. సింహాద్రి - సై - ఛత్రపతి సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్ళిపోయిన మౌళి మగధీరతో మళ్లీ మన తెలుగు సినిమా గురించి భారతదేశమంతా చెప్పుకునేలా చేశాడు. ఇక ఈగని సృష్టించుకుని మౌళి చేసిన మోళి అంతా ఇంతా కాదు. మన నేలను దాటి ఖండాంతరాల వరకూ అతని ఖ్యాతి విస్తరించింది.

పట్టిందల్లా బంగారం కావడంతో తన కలను కళ ద్వారా సాకారం చేయడానికి భారతదేశ అతి పెద్ద మోషన్ పిక్చర్ బాహుబలి సిరీస్ ని మొదలుపెట్టి మొదటిభాగంతో యూనివర్సల్ స్టార్ గా మారిపోయాడు. మన ముందు తరం ప్రేక్షకులు స్వర్గీయ కె.వి రెడ్డిగారి గురించి చెప్పుకున్నట్టే మన తరువాత తరం సినీ ప్రియులు రాజమౌళి కీర్తి గురించి చర్చించుకుంటారనడం అతిశయోక్తి కాదు. తాను కష్టపడుతూ తన స్థాయిని పెంచుకుంటే శ్రామికుడు.. తాను కష్టపడుతూ తన చుట్టూ వున్న వారి స్థాయి పెంచుతుంటే నాయకుడు.. అలాంటి నాయకుడు... హీరోలకు సూపర్ హిట్లిచ్చే వీరుడు... తెలుగు కళామతల్లి సుతుడు.. ష్యూర్ సక్సెస్ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు...
Tags:    

Similar News