#RRR క్రెడిట్స్ తో లాక్ చేసి లీకుల్లేకుండా ప్లాన్

Update: 2021-08-25 07:30 GMT
సృజ‌నాత్మ‌క‌త అనేది ఒక‌రి సొత్తు కాదు. టీమ్ వ‌ర్క్ చేసిన‌ప్పుడు అది ఎవ‌రి నుంచి అయినా పుట్టిన‌ది అయ్య ఉండొచ్చు. కానీ క్రెడిట్స్ వేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు గ‌ట్స్ ఉండాలి. క్రెడిట్స్ ఒరిజిన‌ల్ క్రియేట‌ర్ కి ఇచ్చిన‌ప్పుడే వారి గొప్ప‌తనం నిజాయితీ చిత్త‌శుద్ధి బ‌య‌ట‌ప‌డ‌తాయి. కానీ అలా ఇచ్చేందుకు ఎంత‌మంది ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉంటారు? ఇది చాలా పెద్ద చిక్కు ప్ర‌శ్న‌. చాలా మంది ర‌చ‌యిత‌లు సాంకేతిక నిపుణులు త‌మ‌కు క్రెడిట్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న చెందుతూ మీడియాల‌కెక్కిన సంద‌ర్భాలున్నాయి. సినిమా క‌థ క‌థ‌నం లేదా లిరిక్ లేదా విజువ‌ల్ విష‌యంలో త‌మ సూచ‌న‌లు ఉన్నా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ‌కు క్రెడిట్స్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న చెందిన వారున్నారు.

అదంతా అటుంచితే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తీస్తున్న‌ప్పుడు ఇలాంటి వివాదాలు స‌హ‌జంగా బ‌య‌ట‌ప‌డాలి. కానీ జ‌క్క‌న్న ఏం చేశారో కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి వివాదం లేదు. ఫ‌లానా థీమ్ నా క‌థ‌కు కాపీ అని ఎవ‌రూ అన‌లేదు. ఫ‌లానా పోస్ట‌ర్ ఫలానా హాలీవుడ్ మూవీకి కాపీ అని కూడా ఎవ‌రూ విమ‌ర్శించ‌లేదు. చూస్తుంటే జ‌క్క‌న్న ఎంతో ప‌క‌డ్భందీ వ్యూహంతో ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఆయ‌నేం చేసి ఉంటారు! అంటే.. ఈసారి త‌న టీమ్ మెంబ‌ర్స్ తో ఆయ‌న పెద్ద డీల్ పెట్టుకున్నార‌ట‌. సృజ‌నాత్మ‌క విభాగంలో ఎవ‌రు ఏ కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రించినా ఆ క్రెడిట్ ని వారికే క‌ట్ట‌బెడ‌తారు. ఓపెన్ గా చెబుతారు. టైటిల్స్ లో వేస్తారు. దీంతోనే స‌గం స‌మ‌స్య స‌మ‌సిపోయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. RRR విషయంలో ఇలాంటివి జరగకుండా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజమౌళి మొత్తం సిబ్బందిని కంట్రోల్ లో ఉంచార‌ట‌. సినిమాకి సంబంధించిన మంచి లేదా చెడు ఏమీ బ‌య‌ట‌కు వెల్లడించకూడదని సిబ్బందితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. క్రెడిట్స్ జాబితాలో కూడా వారి పేరును ప్రదర్శిస్తామ‌ని రాతపూర్వక హామీ ఇచ్చార‌ట‌. ఆ విధంగా వివాదాల‌కు ఆస్కారం లేకుండా చేశార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇది మంచి విధానం. అంద‌రూ అనుస‌రించ‌ద‌గిన‌ది. ఇక‌పై టాలీవుడ్ లో ఏ పెద్ద సినిమా తీసినా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇలానే చేయాలి. క్రియేటివిటీ ఒక‌రి నుంచి కొట్టేయ‌కూడ‌దు. క్రియేట‌ర్ల‌ను పెంచి పోషించేలా వ్య‌వ‌హ‌రించాలి. దానివ‌ల్ల బోలెడంత ట్యాలెంట్ ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇంత‌కుముందు బాహుబలి విడుదల సమయంలో కేరళకు చెందిన ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ తనకు మూవీ టీమ్ సరిగా క్రెడిట్స్ ఇవ్వ‌లేద‌ని వాదించే ప్ర‌య‌త్నం చేశాడు. ఫేస్ బుక్ లో కొన్ని స్కెచ్ లను పంచుకుంటూ ``కట్టప్ప బాహుబలిని కత్తితో పొడిచాడు`` అనేది తన ఆలోచన అని వెల్లడించడానికి ప్రయత్నించాడు. కానీ బాహుబలి అసాధార‌ణ‌ విజయం జ‌క్క‌న్న హ‌వా ముందు ఆ ఆరోప‌ణ‌లు నిల‌బ‌డ‌లేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న క్వ‌శ్చ‌న్ త‌మ‌దేన‌ని బాహుబ‌లి రైటింగ్ టీమ్ వాదించింది. ఆ వివాదం అలా ముగిసిపోయింది. చాలా భారీ చిత్రాల పోస్ట‌ర్లు లిరిక్స్ విష‌యంలోనూ ఈ త‌ర‌హా వివాదాలు బ‌య‌ట‌ప‌డినా అంతిమంగా విజ‌యం త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడికే అన్ని క్రెడిట్లు వెళ్లిన సంద‌ర్భాలు చాలా ఎక్కువ‌.

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ద‌స‌రా బ‌రి నుంచి పోస్ట్ పోన్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వ‌చ్చే ఏడాదిలోనే రిలీజ‌వుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే రాజ‌మౌళి అండ్ టీమ్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News